బాబు టూర్‌.. జ‌గ‌న్ తెగ‌దెంపులు!

టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుట్టిన రాజ‌కీయ వేడి ఇప్పుడు ఢిల్లీ చేర‌నుంది. తెలుగు దేశం పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సోమ‌వారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నుండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్రప‌తిని క‌లిసి రాష్ట్రంలోని ప‌రిస్థితులు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు విష‌యాల‌ను ఆయ‌న‌తో ప్ర‌స్తావించి బాబు రాష్ట్రప‌తి పాల‌న కోరే అవ‌కాశాలున్నాయి. దీంతో బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌పై అధికార వైసీపీ అధినేత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి సారించార‌నే వార్త‌లు వస్తున్నాయి. బాబుతో మాట్లాడిన త‌ర్వాత బీజేపీ నేత‌లు వేసే అడుగుల‌ను బ‌ట్టి జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో ప‌రిణామాల త‌ర్వాత అవ‌స‌ర‌మైతే బీజేపీతో దూరం అయేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. త‌న‌ను ఇబ్బంది పెడుతున్న బాబుకు బీజేపీ నేత‌లు ఎలాంటి అవ‌కాశం ఇచ్చినా జ‌గ‌న్ ఆ పార్టీ నుంచి మొత్తానికి దూర‌మయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఢిల్లీ టూర్‌లో భాగంగా రాష్ట్రప‌తిని క‌లిసే బాబు ప్ర‌ధాని మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం కూడా తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే వీళ్లిద్ద‌రిలో ఏ ఒక్క‌రి అపాయింట్‌మెంట్ బాబుకు ల‌భించినా బీజేపీ ప‌ట్ల జ‌గ‌న్ త‌న వైఖ‌రి మార్చుకునే ఆస్కార‌ముంది.

ప్ర‌స్తుతం బీజేపీతో నేరుగా సంబంధాలు లేక‌పోయినా జ‌గ‌న్ ప‌రోక్షంగా మ‌ద్ద‌తిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో మాత్రం జ‌గ‌న్‌కు కేంద్రం నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు ల‌భించ‌డం లేదు. పోల‌వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వ‌క‌పోవ‌డం బిల్లుల‌ను వెన‌క్కి తిరిగి పంపించ‌డం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌రణ అంశాలు జ‌గ‌న్‌కు ఇబ్బంది క‌లిగించేవే. అయిన‌ప్ప‌టికీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో ఉంచుకుని జ‌గ‌న్ కేంద్రంలోని బీజేపీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో త‌న ప్ర‌త్య‌ర్థి చంద్ర‌బాబుకు సానుకూలంగా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌నే ప్ర‌చారం సాగుతోంది.

మ‌రోవైపు జ‌గ‌న్‌కు బీజేపీ అవ‌స‌రం పెద్ద‌గా లేదు. కానీ బీజేపీకే జ‌గ‌న్ అవ‌స‌రం ఉంది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీకి ఏ మాత్రం సీట్లు త‌గ్గినా ఆ పార్టీకి జ‌గ‌న్ మద్ద‌తు కావాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఏం చేస్తారో ఆలోచించుకోవాల‌ని జ‌గ‌న్‌ కేంద్రంలోనే పెద్ద‌ల‌కే నిర్ణ‌యాన్ని వ‌దిలేసిన‌ట్లు క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో బీజేపీ పొత్తులు పెట్టుకుంటుంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు బాబుకు సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారా? లేదా జ‌గ‌న్‌తో అనుబంధం కొన‌సాగించ‌డం కోసం బాబును దూరం పెడ‌తారా? అన్న‌ది వేచి చూడాలి.