కోట్ల ష‌ర‌తులు...ఇవ‌న్నీ చేస్తేనే టీడీపీలో చేరుతా!

కోట్ల ష‌ర‌తులు...ఇవ‌న్నీ చేస్తేనే టీడీపీలో చేరుతా!

తెలుగు రాజ‌కీయాల్లో ఊహించ‌ని ట్విస్ట్ అనే రీతిలో కొనసాగుతున్న మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే ఎపిసోడ్ ఊహించ‌ని మలుపు తిరిగింది.కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఆయన తన కుటుంబ సభ్యులు, పెద్దసంఖ్యలో అనుచరులతో కలిసి వచ్చి సోమవారం రాత్రి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. కర్నూలు ఎంపీ టికెట్‌తో పాటు దోన్, ఆలూరు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందిగా ఆయన కోరుతున్నారు. దీనిపై అర్ధరాత్రి వరకూ ముఖ్యమంత్రితో చర్చలు జరిగాయ. ఆయన పార్టీలో చేరినట్లు ఏ క్షణంలోనైనా ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారం. అయితే దీనికి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు. అస‌లు తాను చంద్ర‌బాబును క‌లిసిన‌ప్పుడు రాజ‌కీయాలేవీ...చ‌ర్చ‌కు రాలేద‌న్నారు.

త‌న చేరిక, ఏపీ సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం గురించి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కర్నూలు జిల్లాకు ఎంతో అవసరం ఉన్న మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదిస్తేనే టీడీపీలో చేరే అంశంపై ఆలోచిస్తానని కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తాను చంద్రబాబునాయుడును కలిసింది కేవలం సాగునీటి ప్రాజెక్టుల అంశంపై చర్చించడానికేనని తెలిపారు. ఆయనతో సమావేశమైన సందర్భంలో రాజకీయ పరమైన అంశాలు ఏవీ చర్చకు రాలేదని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో చేరమని 2014 ఎన్నికలకు ముందే ఆ పార్టీ నుంచి ఆహ్వానం అందిందని, అయితే తాను ఇంతకాలం కాంగ్రెస్‌లో కొనసాగానని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తీసుకున్న అనేక పొరపాట్లను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్నారు. దీంతో బలపడాల్సిన కాంగ్రెస్‌ను మరింత బలహీనపరుస్తూ ఎటూతోచని స్థితిలోకి నెట్టేశారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజా స‌మావేశం గురించి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వివ‌రిస్తూ...తాను చంద్రబాబునాయుడును కలిసినప్పటికీ పార్టీలో చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తాను ప్రధానంగా దిగువ కాల్వ భూగర్భ పైపులైన్ ద్వారా తుంగభద్ర నుండి కాల్వకు నీటిని అందించడం, గుండ్రేవుల జలాశయం నిర్మించడం, వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరానన్నారు. వీటిలో ప్రస్తుతం వేదవతిపై ఎత్తిపోతల పథకానికి తక్షణం ఆమోదం తెలియజేస్తానని, దాంతోపాటు ఆర్‌డీఎస్ కుడి కాల్వకు కూడా ఆమోదం తెలుపుతానని సీఎం పేర్కొన్నట్లు వెల్లడించారు. ఆ మేరకు రెండు జీవోలను జారీ చేసిన విషయాన్ని స్వయంగా చంద్రబాబే తనకు ఫోన్ చేసి తెలిపారన్నారు. ఇక దిగువ కాల్వ భూగర్భ పైపులైన్ నిర్మాణానికి మరో వారం రోజుల్లో పరిపాలన ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేస్తామని వెల్లడించినట్లు కోట్ల సూర్య అన్నారు. గుండ్రేవుల జలాశయం నిర్మాణ పనులపై డీపీఆర్ సిద్దంగా ఉందని, తుది పరిశీలన తెలంగాణ ప్రభుత్వంతో చర్చల అనంతరమే దానిపై స్పష్టత వస్తుందని, అయితే గుండ్రేవుల నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు కోట్ల సూర్య పేర్కొన్నారు. రైతుల కోసం తన తండ్రి దివంగత కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి సైతం కృషి చేశారని, ఆయన బాటలోనే తాను కూడా రైతు సమస్యలపై అనేక పోరాటాలు చేశానని పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడును కలిసింది కూడా సాగునీటి ప్రాజెక్టుల కోసమేనని, రాజకీయ పరమైన అంశాలేవి ఇందులో లేవన్నారు. ముఖ్యమంత్రి తన విజ్ఞప్తిని పరిశీలించి సానుకూలంగా స్పందించినందున తన సన్నిహితులు, కుటుంబం, పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించి తెలుగుదేశం పార్టీలో చేరే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు. టీడీపీలో అయితే తమకు తగిన గౌరవం ఉంటుందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English