ఎమ్మెల్సీ ఇవ్వండి ప్లీజ్...

ఎమ్మెల్సీ ఇవ్వండి ప్లీజ్...

తెలంగాణ‌లో ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ప్ర‌భంజ‌నం సృష్టించింది. తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసింది. కానీ కొన్ని చోట్ల ఆ పార్టీ నేత‌లూ ఓడిపోయారు. ఇలా ఓడిన వారిలో న‌లుగురు మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప‌ద‌వి లేకుండా ఐదేళ్ల పాటు క‌ష్ట‌మ‌ని ఈ ప‌రాజితులు భావిస్తున్నారు. అందుకే ప్ర‌భుత్వంలో ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ ప‌ద‌వుల్లో ఏదో ఒకటి ద‌క్కేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ పార్టీ అగ్ర నాయ‌క‌త్వాన్ని ప్ర‌సన్నం చేసుకునే ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేశారు.

గ‌త ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌నిచేసిన ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, చందూలాల్ ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాల‌య్యారు. వారిలో మ‌హేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వి లేదా చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్‌, కేటీఆర్ ల‌తో ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తే మంత్రి ప‌ద‌వినీ ద‌క్కించుకోవ‌చ్చున‌ని ఆయ‌న యోచిస్తున్నార‌ట‌.

ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు బ‌య‌ట పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయితే - కేసీఆర్ కు ఆయ‌న స‌న్నిహితుడు. కాబట్టి తుమ్మ‌ల‌కు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ద‌క్క‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జూప‌ల్లి కృష్ణారావు, చందూలాల్ కూడా ప్ర‌భుత్వ ప‌ద‌వి కోసం టీఆర్ ఎస్ అగ్ర నాయ‌క‌త్వానికి విజ్ఞ‌ప్తి చేసుకుంటున్నార‌ట‌. వీరితోపాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎన్నిక‌ల్లో ఓడిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ప‌ద‌వుల కోసం కేసీఆర్‌, కేటీఆర్ ల చుట్టూ కాళ్ల‌రిగేలా తిరుగుతున్న‌ట్లు స‌మాచారం.

ఎన్నిక‌ల్లో ఘ‌న విజయం అనంత‌రం గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మాట్లాడుతూ.. ఓడిన నేత‌ల‌ను తాను నిర్ల‌క్ష్యం చేయ‌బోన‌న్నారు. వారిని కాపాడుకునే బాధ్య‌త త‌న‌పై ఉంద‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే వారంతా సీఎంను క‌లిసి ప‌ద‌వుల కోసం విన్న‌విస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇక ఐదేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యే ఆధిప‌త్యం సాగుతుంది కాబ‌ట్టి వారిని త‌ట్టుకొని కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవాలంటే ప్ర‌భుత్వంలో ఏదో ఒక ప‌ద‌వి కావాల్సిందేన‌ని పార్టీ అధినాయ‌క‌త్వానికి వారంతా విజ్ఞ‌ప్తి చేస్తున్నార‌ట‌. మ‌రి వారిలో ఎంత‌మందిని ప‌ద‌వులు వ‌రిస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English