కాంగ్రెస్ నిర్ణ‌యం ఎఫెక్ట్!... కోట్ల కుటుంబంలో చీలిక!

కాంగ్రెస్ నిర్ణ‌యం ఎఫెక్ట్!... కోట్ల కుటుంబంలో చీలిక!

ఏపీలో ఎన్నిక‌లకు గ‌డువు స‌మీపిస్తున్న కీల‌క త‌రుణంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాదిరిగా కాంగ్రెస్‌తో క‌లిసి టీడీపీ ఏపీ ఎన్నిక‌ల‌కు వెళ్లే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే... నిన్న‌టికి నిన్న హ‌స్తం పార్టీ పెద్ద‌లు టీడీపీకి పెద్ద ఝ‌ల‌క్కిస్తూ... ఏపీలో టీడీపీతో క‌లిసి పోటీ చేసే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి పారేశారు. అదే స‌మ‌యంలో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, లోక్ స‌భ స్థానాల్లోనూ పోటీ చేస్తామ‌ని కూడా కాంగ్రెస్ పెద్ద‌లు ర‌ఘువీరారెడ్డి, ఊమెన్ చాందీలు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ మాదిరే టీడీపీ కూడా ఒంట‌రి పోరుకు సిద్ద‌ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌నే చెప్పాలి. అయితే ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్తు లేద‌ని తెలిసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియ‌ర్ నేత ఇప్పుడు తెగ ఇదైపోతున్నారు. ఎందుకంటే... రెండు పార్టీలు క‌లిసి పోటీ చేస్తేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నకు గెలుపు మీద ఓ మేర ఆశ‌లుంటాయ‌ట‌. అదే ఒంటరిగా పోటీ చేస్తే ఓట‌మి ఖాయ‌మేన‌ట. ఇదే విష‌యాన్ని గ్ర‌హించిన మీద‌టే స‌ద‌రు నేత ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ను వ‌దిలి టీడీపీలో చేరేందుకు సిద్ధ‌ప‌డిపోతున్నార‌ట‌. అయితే ఈ సీనియ‌ర్ తీసుకున్న నిర్ణ‌యం త‌న కుటంబాన్ని రెండుగా చీల్చేసింద‌ట‌. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యం ఆ కుటుంబంలో విభేదాల నిప్పు రాజేసింద‌న్న మాట‌.

ఆ క‌థాక‌మామీషు ఏమిటో ఓ సారి చూద్దామా? ఏపీలోని క‌ర్నూలు జిల్లాకు చెందిన కోట్ల విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి తెలుసు క‌దా. ఉమ్మ‌డి రాష్ట్రానికి రెండు సార్లు సీఎంగా ప‌నిచేసిన కోట్ల... పెద్ద‌గా రాయ‌ల‌సీమ‌కు ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌నే వాద‌న ఉంది. రాయ‌ల‌సీమ‌కే కాకుండా రాష్ట్రంలోనూ త‌న పాల‌న‌కు గుర్తుగా ఆయ‌న పెద్ద‌గా చేసిందేమీ కూడా లేదు. మొత్తంగా నాడు కాంగ్రెస్ పార్టీలో నెల‌కొన్న గ్రూపు త‌గాదాల కార‌ణంగా ఓ రెండు ప‌ర్యాయాలు సీఎంగా అయితే ప‌ద‌విని చేప‌ట్టారు త‌ప్పించి పెద్ద‌గా పొడిచిందేమీ లేదు.

కోట్ల విజ‌య‌భాస్క‌ర రెడ్డి రాజ‌కీయాల నుంచి క‌నుమ‌రుగు అవుతున్న క్ర‌మంలో ఆయ‌న వార‌సుడిగా ఆయ‌న కుమారుడు కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. రెండు సార్లు ఎంపీగా క‌ర్నూలు నుంచి గెలిచిన కోట్ల జూనియ‌ర్‌... యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగానూ ప‌ద‌వి చేప‌ట్టారు. ఇక విజ‌య భాస్క‌ర‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న కోడ‌లు (సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి స‌తీమ‌ణి) కూడా రాజకీయాల్లోకి వ‌చ్చారు. డోన్ ఎమ్మెల్యేగా ప‌నిచేసిన ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... తెలుగు నేల‌ను విభ‌జించిన పాపానికి కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్ర‌జ‌లు స‌మాధి క‌ట్టారు. ఈ క్ర‌మంలో కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కూడా ఘోరంగా ఓట‌మిపాల‌య్యారు.

అయితే ఈ సారి అనుకోకుండా టీడీపీ, కాంగ్రెస్‌ల మ‌ధ్య కుదిరిన పొత్తు... వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తుంద‌ని కోట్ల భావించారు. ఎలాగంటే... ఈ రెండు పార్టీల ఓట్లు క‌లిసిపోతే... వైసీపీపై త‌న విజ‌యం సులువేన‌న్న‌ది ఆయ‌న లెక్క‌. అయితే తెలంగాణ‌లో మాదిరిగా ఏపీలో టీడీపీతో పొత్తు లేద‌ని కాంగ్రెస్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కోట్ల అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఓ టెర్మ్ ఇంటి వ‌ద్దే కూర్చున్న కోట్ల‌... రెండో సారి కూడా ఐదేళ్ల పాటు ఇంటి ప‌ట్టునే కూర్చునేందుకు సిద్ధంగా లేర‌ట‌. దీంతో త‌న గెలుపే ప‌ర‌మావ‌ధిగా ఆలోచించిన కోట్ల‌... కాంగ్రెస్ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌డుతూ టీడీపీలోకి చేరిపోయేందుకు దాదాపుగా నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే రేపు ఆయ‌న త‌న కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే... త‌న సోద‌రుడు తీసుకోబోయే నిర్ణ‌యాన్ని విజ‌య‌భాస్క‌ర‌రెడ్డి రెండో కుమారుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ట‌. ఉంటే గింటే కాంగ్రెస్ పార్టీ... లేదంటే వైసీపీనే అని వాదిస్తున్న హ‌ర్ష‌... కాంగ్రెస్ సిద్ధాంతాల‌కు వ్య‌తిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీలోకి వెళ్ల‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. అయితే సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి వెన‌క్కు త‌గ్గేట్టుగా క‌నిపించ‌క‌పోవ‌డంతో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి ఏకంగా వైసీపీలోకి చేరిపోయేందుకు నిర్ణ‌యించుకున్నార‌ట‌. అంటే టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యం కోట్ల కుటుంబంలో వ‌ర్గ పోరును రాజేసింద‌న్న మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English