నాన్న మాదిరి సాఫ్ట్ ఉండ‌ను నేను!: కేటీఆర్‌

 నాన్న మాదిరి సాఫ్ట్ ఉండ‌ను నేను!: కేటీఆర్‌

టీఆర్ఎస్ పార్టీ మీద కేటీఆర్ ప‌ట్టు బిగిస్తున్నారా?  ఇంత‌కాలం దాగిన మొహ‌మాట‌పు ప‌ర‌దాలు తొలుగుతున్నాయా?  ప‌బ్లిక్ గానూ.. ప్రైవేటు సంభాష‌ణ‌ల్లోనూ తండ్రి ప్ర‌స్తావ‌న‌ను చాలా అరుదుగా తెచ్చే కేటీఆర్ ఇటీవ‌ల కాలంలో అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా?  కొన్ని విష‌యాలు త‌న‌కు సంబంధం లేవ‌న్న‌ట్లుగా ఉండే కేటీఆర్.. ఇప్పుడు మాత్రం కొత్త‌గా మాట్లాడుతున్నారా? అంటే అవున‌నే మాట వినిపిస్తోంది.

టీఆర్ఎస్ కు మిత్రులు.. ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌న్న‌ది కేసీఆర్ డిసైడ్ చేసేవారు. ఎవ‌రిని ఎప్పుడు ఆకాశానికి ఎత్తేయాలో.. పాతాళానికి తొక్కేయాల‌న్న విష‌యంపై ఆయ‌నే నిర్ణ‌యం తీసుకునేవారు. వాటికి సంబంధించి కేసీఆర్ ఎవ‌రితోనూ చ‌ర్చించేవారు కాదు. ఆయ‌న మాట‌ల‌కు త‌గ్గ‌ట్లుగా.. అధినేత మ‌న‌సులోని ఆలోచ‌న‌ల్ని గ్ర‌హించి మాట్లాడ‌టం టీఆర్ఎస్ లో ఉండేది. ఇందుకు కేటీఆర్ సైతం మిన‌హాయింపు కాదు.

కానీ.. అందుకు భిన్నంగా ఇప్పుడు కేటీఆర్ మాట తీరు ఉంద‌న్న మాట బలంగా వినిపిస్తోంది. త‌మ ప్ర‌త్య‌ర్థులు ఎవ‌ర‌న్న విష‌యంపై కేటీఆర్ ఓపెన్ గా మాట్లాడ‌ట‌మే కాదు.. తాను పంపాల్సిన హెచ్చ‌రిక సంకేతాల్ని పంపిస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.  ఇటీవ‌ల కొంత‌మంది మీడియా మిత్రుల‌తో భేటీ అయిన సంద‌ర్భంగా.. కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

త‌న తండ్రి మాదిరి త‌న‌కు ఉదార‌త్వం త‌క్కువ‌ని.. త‌మ‌ను.. త‌మ పార్టీని న‌ష్ట‌ప‌రిచేలా చేసే చ‌ర్య‌ల్ని తాను ఉపేక్షించ‌న‌ని ఆయ‌న చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల వేళ త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన మీడియా సంస్థ‌లు.. వాటి అధిప‌తుల‌ను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English