కేసీఆర్ చండీయాగం...విశిష్ట అతిథి జ‌గ‌న్‌

కేసీఆర్ చండీయాగం...విశిష్ట అతిథి జ‌గ‌న్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మ‌రోయాగం చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగం చేయనున్నారు. గులాబీ ద‌ళ‌ప‌తికి చెందిన వ్యవసాయక్షేత్రంలో ఈ మేర‌కు ఏర్పాట్లు దాదాపు పూర్త‌య్యాయి. గతంలో నిర్వహించిన ఆయుత చండీ మహాయాగం తరహాలో ఈ దఫా కూడా శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో శృంగేరి శారదాపీఠం సంప్రదాయంలో ఈ మహాయాగాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ యాగంలో 200 మంది ఋత్వికులు పాల్గొంటారు. ఈ యాగానికి విశిష్ట అతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం.


మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ ప్రధానంగా పాల్గొంటారు. త‌మ‌తో పాటుగా కుటుంబ సభ్యులతో మాత్రమే యాగం నిర్వహించాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ భావించిన‌ట్లు స‌మాచారం. గతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త‌దిత‌రుల‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా ఈసారి రాజకీయ నాయకులను ఆహ్వానించకుండా కేవలం కుటుంబ సభ్యులతో, తనకు సన్నిహితంగా ఉండే పార్టీ రాష్ట్ర నాయకులను పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు స‌మాచారం. అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైతం ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ సైతం విచ్చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఇదిలాఉండ‌గా, ఈ యాగానికి వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, ధర్మాచార్యులు, స్వామిజీలు, అథ్యాత్మిక, థార్మికవేత్తలు, వేద పండితులు, ప్రముఖులను ఆహ్వానించారు. సహస్ర చండీ యాగంలో మొదటి రోజు సప్తశతి చండీ పారాయాణాలు నిర్వహిస్తారు. రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయాణాలు నిర్వహిస్తారు. ఇలా మొత్తం వెయ్యి పారాయాణాలు పూర్తి చేస్తారు. ఐదవ రోజున ఏకాదశ యజ్ఞ కుండాల వద్ద వంద పారాయాణాలు, స్వాహకారాలతో హోమం నిర్వహించి, ఆ తర్వాత పూర్ణాహుతితో యాగం పరిసమాప్తి అవుతుంది. మహారుద్ర యాగంలో నాలుగు రోజులూ రుద్ర పారాయాణాలు, చివరి రోజు రుద్ర హవనం పూర్ణాహుతి జరుగుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English