డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికారా.. మీ ఉద్యోగం ఊడినట్లే..

డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికారా.. మీ ఉద్యోగం ఊడినట్లే..

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం తాగి వాహనాలు నడపడమేనని అందరికీ అర్థమవుతోంది. కానీ, ఆ పని మాత్రం మానడం లేదు. ప్రమాదాలు కొనితెచ్చుకోకుండా ఉండడం లేదు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఇక లాభం లేదని కాస్త కఠిన నిర్ణయమే తీసుకున్నారు. జనంలో భయం కలిగితే తప్ప మాట వినరన్న ఉద్దేశంతో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికినవారు పనిచేస్తున్న సంస్థలకు వారి వివరాలు పంపించి యాక్షన్ తీసుకోమని సూచిస్తున్నారు. దీంతో చాలామందికి ఉద్యోగాలు ఊడుతున్నాయి కూడా.

మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడి కేసు నమోదైతే జైలుకు వెళ్లడంతో పాటు సదరు వాహన చోదకుడు పనిచేసే కార్యాలయానికి నగర పోలీసులు లేఖలు రాస్తూ సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాలతో పాటు ఫైనాన్షియల్‌ జిల్లాలోని సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పనిచేస్తున్న వారు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు దొరికితే వారి వివరాలను సేకరించి వెంటనే వారు పనిచేసే కార్యాలయాలకు లేఖలు రాసి ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ముఖ్యంగా బహుళజాతి సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వారాంతపు రోజులైన శుక్ర, శని, ఆదివారాల్లో పబ్‌లు, బార్లకు వెళుతూ మద్యం సేవించి రాత్రివేళల్లో వాహనాలను నడుపుతూ ఇళ్ళకు చేరుతున్నారని కొన్ని సందర్భాల్లో మోతాదుకు మించి మద్యం సేవించడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తద్వారా వారి విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. కొందరు పదేపదే దొరుకుతున్నా మారడం లేదంటున్నారు పోలీసులు.

సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ పరిధిలో ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుకుంటూ వెళుతున్న సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సదరు ఉద్యోగి శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతంలో ఎబిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నట్టు ఆయన వద్ద దొరికిన గుర్తింపు కార్డుతో బయటపడింది. ఈ విషయాన్ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ ఏసీపీ సదరు ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ మానవ వనరుల విభాగానికి లేఖ రాస్తూ మీ సంస్థలో పనిచేస్తున్న సదరు ఉద్యోగి వంద ఎంఎల్‌కు మించి మద్యం సేవించారని ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు.

అతిగా మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిని కట్టడం చేసేందుకే వాహనాలను తనిఖీ చేస్తూ మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు సైతం ఇలా మద్యం సేవించి వాహనాలు నడపడంవల్ల జరిగే అనర్థాలను తెలుసుకోలేకపోతున్నారని బాధ్యతగల పౌరులు ఇలా చేయడం సబబేనా అంటూ ఆ లేఖలో సదరు డీసీపీ ప్రస్తావించారు.

పోలీసులు పంపించిన లేఖలను ఆయా సంస్థల మానవ వనరుల విభాగం నోటీసు బోర్డులో ప్రకటించడంతో పాటు కొందరు ఉద్యోగుల జీతాలలో కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరికి పదోన్నతులు కల్పించకుండా చర్యలు తీసుకుంటున్నాయని, కొందరినైతే ఏకంగా ఉద్యోగాల నుంచే తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఒకటికి మించి ఎక్కువసార్లు పోలీసులకు చిక్కితే ఇతర ప్రాంతాలకు కూడా బదిలీ చేస్తున్నట్టు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English