ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వం...స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇస్తాం

ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ ఇవ్వం...స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ ఇస్తాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త వాద‌న వినిపించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్ ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌బోమ‌ని చెప్పేసింది. అయితే, అదే స‌మ‌యంలో అంత‌కు త‌గిన ప్రాధాన్యం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆప్తుల్లో ఒక‌రైన కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. కడపలో రాయలసీమ జిల్లాలలోని 8 పార్లమెంటు నియోజకవర్గాల శక్తి కేంద్రాల ప్రముఖ్‌ సమ్మేళన్‌ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ అభివృద్దికి కేంద్రప్రభుత్వం కట్టుబడి వుందని దురదృష్టం కొద్ది ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరించకుండా మాటికొస్తే స్పెషల్‌ స్టెటస్‌ అంటున్నారని మండిప‌డ్డారు.

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టెటస్‌ కాదు స్పెషల్‌ ట్రీట్‌ మెంట్‌ ఇస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి వెల్ల‌డించారు. అయినా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదని ఆరోపించారు. విభజన చట్టంలో పది సంవత్సరాల్లో పూర్తి చేయల్సిన హామీల్లో ఇప్పటికే 80 శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. మరో 20 శాతం హామీలు మళ్ళీ అధికారంలోకి రాగానే 2020 లో పూర్తి చేస్తామన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమకు కూడా ఇక్కడి ప్రభుత్వం సహకరించడం లేదని దీనికి సంబంధించి సమాచారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు పట్ల కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో కలవాలని ప్రాంతీయ పార్టీలు అనుకుంటే భూస్థాపితమవుతాయని ఇప్పటికే ఇలాంటివి చవి చూశారని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. దేశంలో పొత్తు ధర్మాన్ని పాటించే పార్టీ బీజెపీ అని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక పూర్తిస్థాయి మెజారిటీతో పార్లమెంటులో అడుగుపెట్టింది బీజేపీయేనని అయినా కూడా భాగస్వామ్యపార్టీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం, గౌరవం ఇస్తున్నామన్నారు. కూటమిలో ఐదేళ్ళపాటు ప్రభుత్వాన్ని కొనసాగించిన నేత పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సమర్థపాలన పట్ల దేశంలోనే రాజకీయ పరిశీలకులే సమర్థిస్తున్నారని పే ర్కొన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీగా బీజెపీ అవతరించిందని 12 కోట్లమంది సభ్యులు పార్టీలో వున్నారన్నారు. ఇద్దరు ఎంపీలతో ప్రారంభ మైన బీజేపీ మూడు దశాబ్దాల కాలంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా తెలుగువారి మ‌న‌సు దోచుకునేందుకు రాజ్‌నాథ్‌సింగ్ ప్ర‌య‌త్నం చేశారు. దేశ ప్రతిష్ట, ఔన్నత్యం, ఆత్మగౌరం కోసం పోరాడిన నేతలు ఎన్‌టీ రామారావు, పీవీ నరసింహారావు అని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. ఎన్‌టి రామారావు జాతీయ నాయకుడని కొనియాడుతూ వర్థంతిని పురస్క‌రించుకొని ఆయన కు నివాళులు అర్పించారు. రాష్ట్ర ఆత్మగౌరవమే కాదు జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్‌ పార్టీని పారద్రోలేందుకు ఆయన శ్రమించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గౌరవంలో దేశ గౌరవం, దేశ గౌరవంలో ఆంధ్రప్రదేశ్‌ గౌరవం ఇమిడివుందన్నారు. బీజెపీ అన్ని రాష్ట్రాల ఆత్మగౌరవం కోసం కట్టుబడివుందన్నారు. మాజీ భారత ప్రధాని, దివంగత పివి నరసింహారావు ఆర్థిక విధానాల్లో ఆదర్శమని ఆయన నూతన ఆర్థిక విధానాలను మేము కూడా ముందుకు తీసుకెళుతున్నామని పేర్కొన్నారు. పివి నరసింహారావు దేశ ఔనత్యం కోసం పాటుపడిన నేతని కొనియాడారు. అలాంటి నాయకుడి పట్ల కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన వైఖరిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తు చేసుకోవాలన్నారు. ఆయన పార్థీవ దేహాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసుకు కూడా రాకుండా పంపివేశారని ఈసందర్భంగా గుర్తు చేశారు. పీవీ నరసింహారావు గురించి గొప్పగా చెబుతున్నారేంటి అని కొందరు అనుకోవచ్చు. దేశ ఔన్నత్యం కోసం తపించిన ఎవరినైనా తాము గౌరవిస్తామని పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English