హైదరాబాద్‌కు అమిత్‌షా..ఇంత‌కీ ఏం తేలుస్తారో?

హైదరాబాద్‌కు అమిత్‌షా..ఇంత‌కీ ఏం తేలుస్తారో?

తెలంగాణ బీజేపీ మ‌రోమారు వార్త‌ల‌కు ఎక్కింది.!  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు, పార్లమెంటరీ ఇంచార్జిలతో ఆయన భేటీ అవుతారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు అమిత్‌షా నగరానికి వస్తున్నట్టు సమాచారం. 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేయగా కేవలం ఒక్క స్థానంలో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. 103 స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే.

తెలంగాణ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బీజేపీ నేత‌లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా, పలు రాష్ర్టాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు, ఇలా అనేకమందితో విస్తృతంగా ప్రచారం చేయించింది. దీని వల్ల సానుకూల ఫలితాలు వస్తాయనే భావనను రాష్ట్ర నాయకులు వ్య‌క్తం చేశారు. అయితే, సీట్ల సంఖ్య పెర‌గ‌డం అటుంచి ఉన్న సీట్లు కూడా పార్టీ కోల్పోయింది. 118 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ.. ఒక్క గోషామహల్‌లోనే గెలుపొందింది. అది కూడా అక్క‌డి  ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్య‌క్తిగ‌త చ‌రిష్మా ఫ‌లితంతోనే అని అంటున్నారు. ఎందుకంటే...పార్టీకి చెందిన ముఖ్య‌లైన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జీ కిషన్‌రెడ్డి, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్వీఎస్సెస్ ప్రభాకర్ ఓటమి పాలయ్యారు.

గ‌త అసెంబ్లీ వ‌ర‌కు తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 5 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం ఒక్క చోట మాత్ర‌మే గెలుపొందింది. తద్వారా నామ‌మాత్ర‌పు పాత్ర‌కు ప‌రిమితం అయింది. దీంతో తెలంగాణ ఇప్పుడు అవ‌కావం చిక్కితే అధికారం లేక‌పోతే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదా అయినా ద‌క్కించుకోవ‌డం అనే బీజేపీ ల‌క్ష్యం నెర‌వేర‌లేక‌పోయింది. ఈ  పరిణామాలపై బీజేపీ జాతీయ నేతలు ఆగ్ర‌హం ఉన్న‌ట్లు స‌మాచారం. నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అమిత్‌షా ఆరా తీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌నున్నార‌ని స‌మాచారం

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English