టాక్ దారుణం.. అయినా హౌస్ ఫుల్

టాక్ దారుణం.. అయినా హౌస్ ఫుల్

ఈ రోజుల్లో కొత్త సినిమా తొలి రోజు టాక్ అనేది చాలా కీలకంగా మారింది. సమీక్షలు పాజిటివ్‌గా ఉండాలి. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగుండాలి. సోషల్ మీడియా టాక్ కూడా సానుకూలంగా ఉండాలి. అప్పుడే వసూళ్లు బాగుంటాయి. టాక్ బ్యాడ్‌గా ఉండి, రివ్యూలు నెగెటివ్‌గా వస్తే అంతే సంగతులు. మధ్యాహ్నం షోల నుంచే కథ మారిపోతుంది. ఎంతో క్రేజుతో రిలీజైన సినిమాలకు కూడా వసూళ్లు పడిపోతుంటాయి. థియేటర్లు వెలవెలబోతుంటాయి. కానీ ‘వినయ విధేయ రామ’ చిత్రం విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది.

శుక్రవారం రిలీజైన ఈ చిత్రానికి ఎంత బ్యాడ్ టాక్ వచ్చిందో తెలిసిందే. ఉదయం నుంచి ఈ సినిమాపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ టాక్ చూస్తే మధ్యాహ్నం నుంచి థియేటర్లు వెలవెలబోతాయని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సినిమాకు అన్ని చోట్లా మంచి ఆదరణే దక్కుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫస్ట్, సెకండ్ షోలు ఫుల్స్ పడ్డాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రిలీజైన మూడు థియేటర్లలోనూ ఫస్ట్ షోకు హౌస్ ఫుల్స్ పడటం ఆశ్చర్యం కలిగించే విషయం.

దీంతో పోలిస్తే ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ బావుందన్నారు. రివ్యూలన్నీ కూడా పాజిటివే. కానీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. తొలి రోజే హౌస్ ఫుల్స్ పడలేదు. రెండో రోజు నుంచి థియేటర్లు వెలవెలబోతున్నాయి. మరి శనివారం ‘ఎఫ్-2’ రిలీజవుతున్న నేపథ్యంలో దానికెలాంటి టాక్ వస్తుందో.. తర్వాత ఏ సినిమా ఎలా ఆడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English