మోడీ ఈబీసీ లెక్క ముంచుతుందా..తేలుస్తుందా?

మోడీ ఈబీసీ లెక్క ముంచుతుందా..తేలుస్తుందా?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ తీసుకున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ) రిజర్వేషన్ బిల్లుపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తురుపుముక్కగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు భావిస్తున్న ఈ బిల్లు కమలం పార్టీని విజేతగా నిలుపుతుందా? లేదంటే పరాజితగా మారుస్తుందా?.. చివరి క్షణంలో ఆదరబాదరాగా తీసుకువచ్చిన ఈబీసీ బిల్లు అగ్ర కులాల మనస్సును గెలుచుకుంటుందా? లేదంటే వారి తిరస్కారానికి గురవుతుందా? అనే ప్రశ్నలు స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

ఈ రిజ‌ర్వేష‌న్ బిల్లు వెనుక బీజేపీ క‌స‌ర‌త్తు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఓసీల‌ను సంతృప్తి ప‌రిచే ముందు ఎస్సీ, బీసీల‌ను బీజేపీ సంతృప్తి ప‌రిచింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని కఠిన నిబంధనలపై అగ్ర కులాలు గుర్రుగా ఉన్నాయి. ఈ చట్టంలోని మార్గదర్శకాలను సవరించేందుకు బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ చట్టాన్ని సాకుగా తీసుకుని తమపై కేసులు నమోదు చేస్తూ దుర్వినియోగం చేస్తున్నారని వారు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. మరోవైపు అట్రాసిటీ చట్టంలో జోక్యం చేసుకుని నిబంధనలు మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని, బీజేపీ హయాంలో తమపై అణిచివేత ధోరణి కొనసాగుతున్నదంటూ దళితులు కాషాయ పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అటు అగ్రకులాలు, ఇటు దళితులు.. రెంటికి చెడ్డ రేవడిలా ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఆర్థికంగా వెనుకబడిన కులా (ఈబీసీ)లకు రిజర్వేషన్ అనే సరికొత్త ఆయుధాన్ని మోదీ తన అమ్ముల పొదినుంచి బయటకు తీశారు. తద్వారా ఉత్తరాదిలో బలమైన వర్గాలైన జాట్లు, బనియాలు, పటేళ్లు, భూమిహార్, మరాఠా, బ్రాహ్మణ తదితర వర్గాల మనసు గెల్చుకునే దిశగా బీజేపీ పావులు కదిపింది. వీరిలో జాట్లు, పటేళ్లు, మరాఠాలు తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గాలను ఓబీసీల్లో చేర్చితే .. ఇప్పటికే ఆ గ్రూపులో ఉన్న కులాలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నొప్పించక..తానొవ్వక రీతిలో కేంద్రం జనరల్ కేటగిరీలోనే ఈబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది.

ఇదే స‌మ‌యంలో ఓబీసీల‌ను ఆకట్టుకునే దిశగా కూడా బీజేపీ యత్నించింది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగహోదా కల్పించడం, ఓబీసీల్లో వర్గీకరణ కోసం ప్రత్యేకంగా కమిషన్‌ను నియమించడం ద్వారా ఆ వర్గాలకు దగ్గరైంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యాదవేతర వర్గా (ఎంబీసీ)లను ఒక్కతాటిపైకి తీసుకురావడం ద్వారా అక్కడ బీజేపీ ఘనవిజయం సాధించింది. ఎంబీసీల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. ప్రధాని మోడీ కూడా తాను ఓబీసీనేనని పదేపదే చెప్పడం ద్వారా ఆ వర్గాల మద్దతు కూడగట్టే యత్నం చేశారు. మరోవైపు రైతుల్ని ఆదుకునేందుకు భారీ కార్యాచరణను ప్రకటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందే కేంద్రం పలు పథకాల్ని ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈబీసీ బిల్లుకు వ్యతిరేకంగా దళితులు, ఓబీసీలు విపక్ష పార్టీలకు మద్దతిచ్చే అవకాశం లేకపోలేదని, ముఖ్యంగా యూపీ, బీహార్‌లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థూలంగా, మోడీ స్కెచ్ ఫ‌లితం మ‌రికొద్దిరోజులో తేల‌నుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English