పార్టీల‌కు మోడీ ఆఫ‌ర్‌...రండి బాబు రండీ

పార్టీల‌కు మోడీ ఆఫ‌ర్‌...రండి బాబు రండీ

ఓ వైపు ఎన్డీఏ నుంచి వివిధ పార్టీలు దూర‌మ‌వుతున్న ఎపిసోడ్‌...మ‌రోవైపు ముంచుకువ‌స్తున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల నేప‌థ్యంలో...బీజేపీ ర‌థ‌సార‌థి, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న రాజ‌కీయ అవ‌స‌రాన్ని వ్యూహాత్మ‌కంగా ప్ర‌క‌టిస్తున్నారు. క‌లిసి వ‌చ్చే వారికి ఓపెన్ ఆఫ‌ర్ ఇస్తూ రండి బాబు రండి అన్న‌ట్లుగా ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో ఎన్‌డీఏని బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోడీ పొత్తులకు ఆహ్వానం పలికారు. పొత్తులకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని ఐదు జిల్లాలకు చెందిన బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఈ మేర‌కు క్లారిటీ ఇచ్చారు.

అన్నాడీఎంకే, డీఎంకే, లేదా రజనీకాంత్ ఏర్పాటు చేయబోయే పార్టీతో బీజేపీ పొత్తుకు సిద్ధమా అని పార్టీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఆయన స‌వివ‌రంగా సమాధానమిచ్చారు. 1990వ దశకంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి సంకీర్ణ రాజకీయాలను విజయవంతంగా నడిపారని మోడీ గుర్తు చేశారు. 20 ఏళ్ల‌ క్రితం దార్శనిక నేత అటల్‌జీ దేశ రాజకీయాల్లో కొత్త సంస్కృతిని తెచ్చారు. అవే విజయవంతమైన సంకీర్ణ రాజకీయాలు. ప్రాంతీయ ఆకాంక్షలకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఆయన చూపిన బాటలోనే బీజేపీ పయనిస్తుంది అని మోడీ అన్నారు. భారీ మెజార్టీ సాధించిన సందర్భాల్లో కూడా భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం నడిపేందుకే బీజేపీ ప్రాధాన్యమిచ్చిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు, ఆకాంక్షల పట్ల కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ప్రజలతో భాగస్వామ్యమే విజయవంతమైన భాగస్వామ్యమని, ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలని కార్యకర్తలకు సూచించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English