టీ కాంగ్రెస్ ఇంకా తేరుకోనేలేదు

టీ కాంగ్రెస్ ఇంకా తేరుకోనేలేదు

రాష్ట్రంలో మూడు విడుతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి విడుత 4,479 పంచాయతీల్లో ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఓ వైపు ఇలా క్షేత్ర‌స్థాయిలో హోరాహోరీ పోరు సాగుతుంటే...అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కాంగ్రెస్‌ ఇంకా తేరుకున్నట్టు కన్పించడం లేదు. అసెంబ్లీ పోరు ముగిసిన వెంటనే వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ నేతలు ముఖం చాటేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలెవరూ గ్రామాల వైపు చూడటం లేదు. పార్టీ నాయకులెవరూ పట్టించుకోకపోవడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి వెనుకంజ వేస్తున్నారు. పెద్దపెద్ద నేతలే ఓడిపోయారు.. మేమెంతా అంటూ ఉసూరుమంటున్నారు.

ఒకవైపు ఇతర పార్టీలకు చెందిన నేతలు ఏకగ్రీవ పంచాయతీల కోసం కృషిచేస్తుంటే కాంగ్రెస్‌ నేతలు ఇప్పటి వరకు పల్లెల్లో అడుగుపెట్టలేదు. మొదటిదఫా ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయడానికి ఉత్సాహం చూపెడుతున్నా నేతల సహకారం లేకపోవడంతో క్యాడర్‌ గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు ద్వితీయశ్రేణి నాయకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో నేతలు అవమానభారంతో గ్రామాల్లోకి రాలేని పరిస్థితి ఉన్నదని పేర్కొంటున్నారు.ఒకపక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్ర పార్టీనేతలు సిగపట్లు పడుతున్నారు. స్వయంగా పీసీసీ అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలు, సీనియర్‌ నేతలపై సస్పెన్షన్‌వేటు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని కిందిస్థాయి నాయకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ గమనిస్తున్న క్షేత్రస్థాయి పార్టీ కార్యకర్తలు కూడా వీరిని పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

ఇదిలాఉడ‌గా, పంచాయతీ సమరం సమయంలోనే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విదేశీటూర్లకు వెళ్లడంతో పార్టీ వ్యవహారాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. యూరప్‌ వెళ్లిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలను గాలికొదిలేశారని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. ఓటమి నుంచి తేరుకుని, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకోవాల్సి ఉండగా నేతలంతా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ద్వితీయశ్రేణి నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విదేశీ టూర్లపై ఉన్న మోజు పార్టీ పటిష్ఠతపై లేకుండాపోయిందని తప్పుపడుతున్నారు. మిగిలిన రెండు విడుతల ఎన్నికలపైన అయినా దృష్టి పెట్టేందుకు నాయకులు చొరవ తీసుకుంటే మంచిదని పార్టీ సీనియర్‌ నేత హన్మంతరావు నేతలకు హితవు పలుకడం కాంగ్రెస్ పార్టీలోని ప‌రిస్థితికి అద్దం ప‌డుతోంద‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English