తుమ్మ‌ల నా గురువు...పార్టీ మార‌డం లేదు

తుమ్మ‌ల నా గురువు...పార్టీ మార‌డం లేదు

తెలంగాణలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు సైతం కారెక్కుతారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా  అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ మారుతారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. తన అనుచరులు, నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో ఆయ‌న సమావేశం అయినట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. దీనికి తోడుగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆయ‌న కలవడంతో పార్టీ మారుతున్నట్టు ప్ర‌చారం జ‌రిగింది.

అయితే దీనిపై అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌లో తాను చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని  తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తాను కలవడంతో పార్టీ మారుతున్నట్టు వార్తలు వస్తున్నాయని.. వాటిని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తన రాజకీయ గురువు  తుమ్మలను ఒక శిష్యుడిగా మర్యాదపూర్వకంగా కలశానని అన్నారు. అంతేతప్ప తమ కలయికలో ఎటువంటి రాజకీయ కారణాలూ లేవని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున తాను గెలిచానని.. అదే పార్టీలో ఉంటానని అన్నారు. 34 ఏళ్ల నుంచి చంద్రబాబునాయుడు తనకు ఎనలేని గుర్తింపునిచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఇదిలాఉండ‌గా, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు ఖమ్మంలో రహస్యంగా కలుసుకుని చర్చించినట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. గులాబీ పార్టీలోని ముఖ్య నేతలతో వీరు సంప్రదింపులు కూడా చేసినట్లుగా రాజకీయ వర్గాల విశ్వసనీయ సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English