కేసీఆర్ మ‌రో యాగం...దీని ప్ర‌త్యేకత వేరే

కేసీఆర్ మ‌రో యాగం...దీని ప్ర‌త్యేకత వేరే

తెలంగాణ రాష్ట్ర స‌మితి అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పూజలతో పాటు యాగాలపై కూడా ఆయ‌న‌కు విశ్వాసం ఎక్కువ. గతంలో పలు యాగాలు నిర్వహించిన గులాబీ బాస్....2015లో ఆయుత చండీయాగం నిర్వహించారు. శాసనసభ ఎన్నికలకు ముందు రాజశ్యామల యాగాన్ని సీఎం కేసీఆర్‌ తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ మ‌రోయాగం చేయ‌నున్నారు.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, సీఎం కేసీఆర్‌ మళ్లీ చండీయాగం నిర్వహించనున్నారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో జనవరి 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహించ‌నున్నారు. బుధవారం మధ్యాహ్నం స్వయంగా కేసీఆర్ యాగం ఏర్పాట్లను పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఆశీరనుమతితో ఈ క్రతువును నిర్వహిస్తున్నారు. ఇటీవల విశాఖ వెళ్లిన సీఎం కేసీఆర్‌.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు.
యాగంలో 200 మంది రుత్వికులు పాల్గొంటారు. సందర్శకులు, భక్తులను అనుమతించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. యాగం ఏర్పాట్లను అష్టకాల రామ్మోహన్‌శర్మ, శృంగేరి పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మ పర్యవేక్షిస్తున్నారు.

కాగా, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు ద‌ృష్టి సారించారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం నాన్ బీజేపీ..నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు..దేశంలోని పార్టీల నేతలను కలిసి దానిపై చర్చిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న యాగంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English