సికింద్రాబాద్ ఎంపీగా నందమూరి సుహాసిని

సికింద్రాబాద్ ఎంపీగా నందమూరి సుహాసిని

నందమూరి సుహాసిని. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన పేరు. అంతే కాదు... తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతో వ్యూహాత్మకంగా తెర పైకి తీసుకువచ్చిన పేరు. అంతవరకూ నందమూరి హరిక్రిష్ణ‌ కుమార్తెగా మాత్రమే బంధువులకు, స్నేహితులకు తెలిసిన నందమూరి సుహాసిని తెలంగాణ మందస్తు ఎన్నికల పుణ్యమాని తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిపోయింది. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందనే దీమా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసినిని ఎన్నికల బరిలో దించారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ వ్యూహం బెడిసికొట్టింది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో అనూమ్యంగా సుహాసిని ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమి అనంతరం చంద్రబాబు నాయుడు నందమూరి సుహాసినిని ఎప్పటి లాగే తన రాజకీయ చతురతలో భాగంగా వదిలేశారు. నందమూరి సుహాసిని ఎన్నిసార్లు ఫోన్లు చేసినా చంద్రబాబు నాయుడి నుంచి స్పందన రాలేదని ఆ మధ‌్య సోషల్ మీడియాలో వార్తలు సైతం వచ్చాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అయితే... " ఎన్నికల్లో ఆడ కూతురు నిలబెట్టారు చంద్రబాబు నాయుడు. ఎన్నికల తర్వాత ఆమెను పట్టించుకోలేదు" అని వ్యాఖ్యానించారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్గాల్లో మాత్రం ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి రిటన్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించిన కె.చంద్రశేఖర రావు తన తొలి ఆయుధాన్ని నందమూరి సుహాసిని రూపంలో ప్రయోగిస్తారంటున్నారు. నందమూరి హరిక్రిష్ణతో మంచి స్నేహం ఉన్న కేసీఆర్ అతి త్వరలో నందమూరి సుహాసినికి గులాబీ తీర్ధం ఇవ్వనున్నారంటున్నారు. నందమూరి సుహాసినిని పార్టీలో చేర్చుకుని ఆమెకు సికింద్రబాద్ లోక్ సభ స్ధానం నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఉన్న ఆడ కూతుర్ని బయటకు లాగి కూకట్‌పల్లి నుంచి శాసనసభకు పోటీ చేయించి ఆమె ఓడిపోయిన తర్వాత అతీగతీ పట్టించుకోని చంద్రబాబు నాయుడికి సికింద్రాబాద్ నుంచి సుహాసినిని గెలిపించి రిటన్ గిఫ్ట్‌ ఇలా ఉంటుందని చూపించాలన్నది కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహంగా చెబుతున్నారు.

ఆమెను పార్టీలో చేర్చుకుందుకు నందమూరి హరిక్రిష్ణ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడి పట్ల నందమూరి హరిక్రిష్ణ కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో హరిక్రిష్ణ కుమార్తెను జాయిన్ చేయించుకుని సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు పంపిస్తే అది చంద్రబాబు నాయుడికి చెంపపెట్టు అని నందమూరి కుటుంబసభ్యులు భావిస్తారని అంటున్నారు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English