అంబానీ పారిపోకుండా చూడాల‌ని కోర్టులో పిటిష‌న్‌

అంబానీ పారిపోకుండా చూడాల‌ని కోర్టులో పిటిష‌న్‌

ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జంగా ఓ వెలుగు వెలిగి...గ‌త కొద్దికాలంగా సుమారు 45 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుని సతమతమవుతున్న పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ మరో ఇరకాటంలో చిక్కుకున్నారు. ఆయనతో పాటుగా ఆర్కామ్ కంపెనీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు దేశం వదిలిపెట్టి పారిపోకుండా చూడాలని స్వీడిష్ టెలికాం కంపెనీ ఎరిక్‌సన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గ‌త ఏడాది దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు  కొన‌సాగింపుగా తాజాగా మరో కోర్టుధిక్కార పిటిషన్ వేసింది. తమకు చెల్లించాల్సిన రూ.550 కోట్లు చెల్లించకుండా కావాలని తాత్సారం చేస్తున్నారని ఆరోపించింది. నిజానికి ఇది తగ్గించిన మొత్తమని, దీనిని చెల్లిస్తానని కోర్టుకు అనిల్ అంబానీ వ్యక్తిగతంగా హామీపత్రం ఇచ్చారని గుర్తు చేసింది. కానీ కోర్టులో కుదిరిన ఒప్పందానికి ఆయన ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని తెలిపింది.

స్వీడిష్ టెలికాం పరికరాల తయారీదారు ఎరిక్‌సన్‌కు వ్యాపార సేవల కింద అనిల్ అంబానీ సొమ్ము బకాయి పడ్డారు. నిజానికి అనిల్ అంబానీ బకాయి రూ.1600 కోట్లు కాగా, కోర్టు మధ్యవర్తిత్వంతో ఎరిక్‌సన్ ఆ మొత్తాన్ని రూ.550 కోట్లకు తగ్గించింది. ఆ సొమ్ము చెల్లించాల్సిన గడువు సెప్టెంబర్ 30న దాటిపోవడంతో ఎరిక్‌సన్  సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదివరకే ఒప్పుకుని చెల్లించకుండా ఎగ్గొట్టిన రూ.550 కోట్ల బకాయీ విషయంలో చట్టాన్ని దుర్వినియోగం చేశారని ఎరిక్‌సన్ ఆరోపించింది.వారికి ఈ దేశ చట్టాలంటే గౌరవం లేదు.. చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఎరిక్‌సన్ తన పిటిషన్‌లో విమర్శించింది. వారిపై కోర్టుధిక్కార నేరం కింద చర్యలు చేపట్టాలని, వారు దేశం వదిలి పారిపోకుండా నిరోధించాలని కోరింది. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌లో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ గడువు తీరిపోవడంతో అక్టోబర్‌లో ఎరిక్‌సన్ అనిల్‌పై కోర్టుధిక్కార పిటిషన్ వేసింది. దాంతో కోర్టు ఆయనకు డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. కానీ అది కూడా ఉల్లంఘించారని ఎరిక్‌సన్ తన పిటిషన్‌లో పేర్కొంది.

కాగా తాను చెల్లింపులు జరుపకపోవడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం కారణమని ఆర్‌కామ్ విడిగా మరో కోర్టుధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. స్పెక్ట్రమ్ అమ్మకం నిధులు అందజేస్తే ఎరిక్‌సన్‌తో పాటుగా ఇతర కంపెనీలకు తాము బకాయీలు చెల్లించేవారమని ఆర్‌కామ్ పేర్కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English