మోడీజీ నీకు ద‌మ్ముంటే ఆ ప‌ని చెయ్‌

మోడీజీ నీకు ద‌మ్ముంటే ఆ ప‌ని చెయ్‌

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఏఎన్‌ఐ విలేకరి స్మితా ప్రకాశ్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై బీజేపీ అసమ్మతి ఎంపీ, సినీనటుడు శతృఘ్న సిన్హా ట్విట్టర్‌లో తనదైన శైలిలో చురకలు వేశారు. ప్రధాని నరేంద్రమోడీ పత్రికా సమావేశాలంటే ఏమాత్రం ఇష్టపడక‌పోవ‌డం, గత నాలుగున్నరేళ్ల‌లో ప్రధానిగా ఆయన ఒక్కటంటే ఒక్కటి పత్రికా సమావేశం నిర్వ‌హించ‌క‌పోవ‌డాన్ని గుర్తు చేస్తూ తాజా ఇంట‌ర్వ్యూపై సెటైర్లు వేశారు. బోలెడు పరిశోధనతో, ఏర్పాట్లతో, పూర్వరంగం సిద్ధం చేసుకుని మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు అని ఎద్దేవా చేశారు.

త‌న‌దైన శైలిలో మోడీని కెలుకుతూ...``ఏదో ఓ విలేకరికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు సరే.. హేమాహేమీల వంటి జర్నలిస్టులు పాల్గొనే బహిరంగ ఇంటర్వ్యూ ఎప్పుడు?`` అని సిన్హా దెప్పిపొడిచారు. ``సర్కారీ జర్నలిస్టులు పాడే రాగ్ దర్బారీలు ఎందుకు? దేశప్రధానులు తరచుగా పత్రికా సమావేశాలు నిర్వహించి మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అదే తరహాలో మీరెందుకు మీడియా ముందుకు రారు?`` అంటూ సిన్హా నిలదీశారు. అంతటితో వదిలిపెట్టకుండా ఎన్డీయే మిత్రులు ఒకరొకరుగా బయటకురావడంపై కూడా ప్రశ్నించారు.

``సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ (అందరి ప్రగతి) అనేది మీ నినాదం కదా? మరి అందరూ ఎందుకు వెళ్లిపోతున్నారు? మిత్రుడు, సహచరుడు, సోదరుడుగా నేనిచ్చే సలహా గురించి ఆలోచించండి.. కాదంటే ఎన్నికలు ఎటూ దగ్గర పడుతున్నాయి.. మనకికి దేవుడే దిక్కు సారూ.. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.. నూతన సంవత్సరం సందర్భంగా అంతా ధైర్యంగా, నిజాయితీగా, ఖుల్లంఖుల్లంగా మాట్లాడుకుందాం.. నాటకీయతలు లేకుండా..`` అంటూ నర్మగర్భంగా ముగించారు.

అయితే, మోడీని బీజేపీ ఎంపీ అయిన  శతృఘ్న సిన్హా ఎత్తిపొడిస్తే...ఈ త‌రుణంలో ఆయ‌నకు స‌ద‌రు విలేక‌రి సెటైర్ వేశారు. సిన్హా సెటైర్ల  ట్వీట్‌లకు ప్ర‌ధాని మోడీని కాకుండా విలేకరి స్మితా ప్రకాశ్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ఆమె ఘాటుగా బదులిచ్చారు. ``మీరు షాట్‌గన్ సిన్హా.. సాంబా కాదు.. సందేశం మోడీకే అయితే ఆయననే ట్యాగ్ చేయండి. నాలాంటి చిన్న జర్నలిస్టులను ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు?`` అని సిన్హాపై చురకలు వేశారు. దీంతో మోడీకి చుర‌క అంటించిన సిన్హా...తాను సైతం దాన్ని రుచి చూడాల్సి వ‌చ్చింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English