ఏపీ బీజేపీ నేత‌లు ఆంధ్రులా.. గుజరాతీలా?

ఏపీ బీజేపీ నేత‌లు ఆంధ్రులా.. గుజరాతీలా?

ప్రధానమంత్రి నేరంద్ర‌ మోడీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప‌ర్య‌ట‌న రాజ‌కీయ వేడిని రాజేస్తోంది. ఆయ‌న‌ రాకపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. తాజాగా పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఏపీకి వస్తున్న ప్ర‌ధానిని వ్యతిరేకిస్తే తప్పేంటని  ప్రశ్నించారు. ఏపీకి జరిగిన  అన్యాయంపై రాష్ట్ర పర్యాటనకు వచ్చే ప్రధాని ఎదుట నిరసన తెలియజేస్తాం. శ్వేత పత్రాలు విడుదల చేయడం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సంప్రదాయం. గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అన్ని  నెరవేర్చాం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని తెలియజేయడానికే శ్వేత పత్రాలు విడుదల చేస్తామన్నారు.

మ‌రో మంత్రి జ‌వ‌హ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఏపీ బీజేపీ నేతలు తాము ఆంధ్రులమనే విషయాన్ని మరిచి గుజరాతీయుల్లా వ్యవహరిస్తున్నారని ఆ లేఖ‌లో మండిప‌డ్డారు. అన్యాయం జరిగిన రాష్ట్రాలను అక్కున చేర్చుకున్నామని తెలిపే మీరు.. ఏపీకి న్యాయం చేయమని ప్రజల తరుపున గ్రామస్ధాయి నేత నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు పోరాడుతుంటే మద్దతు తెలుపకపోగా రాళ్లు వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీస సమాచారం ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొనటం అవకాశవాదానికి పరాకాష్ట కాదా అని అన్నారు. అవినీతి రహిత పాలనంటూ గద్దెనెక్కిన బీజేపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన జగన్ తో అంటకాగుతున్నారు. గత నాలుగేళ్లలో పోలవరంలో జరిగిన పురోగతి ఏంటో.. గతంలో వైఎస్‌ చేసిన పనులేంటో బీజేపీ నేతలకు తెలీదా..? అని ప్రశ్నించారు.

హోం మంత్రి చినరాజప్ప సైతం ఇదే రీతిలో మండిప‌డ్డారు. 'ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదు.  రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని ఎదుట నిరసన తెలియజేస్తే తప్పేంటి. ప్రధాన మంత్రి పర్యటనలో మేము కచ్చితంగా నిరసన తెలియజేస్తాం' అని ఆయ‌న తేల్చి చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English