ప్ర‌భుత్వం ప‌డిపోతుంది...మా పార్టీ అధికారంలోకి వ‌స్తుంది

ప్ర‌భుత్వం ప‌డిపోతుంది...మా పార్టీ అధికారంలోకి వ‌స్తుంది

క‌ర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ మెడ‌పై మ‌రో క‌త్తి వేలాడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అనేక ట్విస్టుల మ‌ధ్య బీజేపీని స‌ర్కారు ఏర్పాటు చేయ‌కుండా, ఏర్పాటు చేసిన స‌ర్కారు ప‌రిపాల‌న కొన‌సాగించ‌కుండా విజ‌యం సాధించి సంకీర్ణ స‌ర్కారు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌-జేడీఎస్‌లు ఇప్పుడు అదే బీజేపీ కార‌ణంగా ఇరుకున ప‌డ్డ‌ట్లు అంచ‌నాలు వెలువ‌డుతున్నాయి.

వారం రోజుల్లో కర్ణాటకలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నదని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమేశ్ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీఎస్-కాంగ్రెస్‌కు చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు దాదాపు 15 మంది నాతో సంప్రదింపులు జరిపారు. వారు సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నందున వచ్చే వారం మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అని ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమేశ్ కత్తి మీడియాతో చెప్పారు. దీంతో క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రోమారు ర‌స‌కందాయంలో ప‌డింది.

కాగా, కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా త‌ర‌చూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్దికాలం క్రితం బెంగళూరులో జేడీఎస్ కార్యకర్తల సన్మాన కార్యక్రమంలో సీఎం కుమారస్వామి తీవ్ర ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ``మీ తమ్ముడో, అన్నో సీఎం అయినట్లు సంతోషిస్తున్నారు కానీ, నేను మాత్రం ఆనందంగా లేను. సంకీర్ణ ప్రభుత్వంలోని పరిణామాలు నన్ను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఎందుకు అనేది మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నా``.. అని కుమారస్వామి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

దీంతో సభలో ఒక్కసారిగా గంభీరవాతావరణం నెలకొంది. రైతు రుణమాఫీపై అధికారులను ఒప్పించడానికి నెలరోజులుగా ఎన్ని తిప్పలు పడ్డానో ఎవరికీ తెలియదు. రుణమాఫీపై సీఎంకే స్పష్టత లేదంటూ మీడియా కథనాలు ప్రచురిస్తున్నది అని వాపోయారు. తన వల్ల కాదనుకుంటే రెండు గంటల్లో రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పారు.

ఇలా సాక్షాత్తు సీఎం పీఠంలో కూర్చున్న వ్య‌క్తికే త‌న సీటుపై క్లారిటీ లేని స్థితికి కార‌ణం బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌నే అంచ‌నా వెలువ‌డింది. దీన్ని నిజం చేస్తూ తాజాగా బీజేపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే ఉమేశ్ కత్తి వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.

ఇదిలా ఉండ‌గా,  కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు ఈ జోష్యాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలాంటి ఊహాజనిత వ్యాఖ్యానాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయలేదని, ముఖ్యమంత్రి కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగానే ఉందని స్పష్టంచేశారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English