కొత్త సంవత్సరంలో మోదీ ఏపీకి తీపి కబురు చెబుతారా?

కొత్త సంవత్సరంలో మోదీ ఏపీకి తీపి కబురు చెబుతారా?

త్వరలో రానున్న కొత్త సంవత్సరం మొదటివారంలోనే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. జనవరి 6న ఆయన ఏపీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన రాష్ట్రానికి తీపి కబురు చెబుతారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు.

ప్రత్యేక హోదా ఇస్తారని తాము చెప్పలేం కానీ కీలకమైన ప్రకటన చేస్తారని మాత్రం గ్యారంటీగా చెప్పగలమని అంటున్నారు. అయితే... పార్టీ కీలక నేతల నోటి నుంచి ఈ మాట వినపడడం లేదు, స్థానిక నేతలే దీన్ని బలంగా చెబుతున్నారు. దీంతో మోదీ వచ్చి మరోసారి తుస్సుమనిపిస్తారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మోదీ నోట రాష్ట్ర ప్రజలు త్వరలో తీపి కబురు వింటారని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రమేష్‌నాయుడు వెల్లడించారు. ప్రజలకు తీపి కబురు వినిపించాలనే ఉద్దేశంతో జనవరి 6న గుంటూరులో నిర్వహిస్తున్న సభకు నరేంద్రమోదీ హాజరవుతున్నారన్నారు. అందరూ కోరుకున్నట్టుగా ప్రత్యేకహోదా ఇస్తారా అని ప్రశ్నించగా, తాము కచ్చితంగా చెప్పలేమని.. అయితే మొత్తానికి తీపి కబురైతే అందరూ వింటారని చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చినన్ని నిధులు ఏ రాష్ర్టానికీ మోదీ ప్రభుత్వం ఇవ్వలేదని బీజేపీ నేతలంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులన్నీ టీడీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. మోదీ రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుండడం దారుణమంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.

అయితే, బీజేపీ నేతలు ఇలా చెబుతుండగా టీడీపీ నేతలు మాత్రం మోదీకి అంత సీను లేదంటున్నారు. ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడే మట్టి నీళ్లు తెచ్చిన ఘనుడని.. ఇంకా ఇప్పుడు రాష్ట్రంపై పగపట్టిన సమయంలో మంచి చేస్తారని ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English