నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి: సీఎం సంచ‌ల‌న ఆదేశాలు!

నిర్దాక్షిణ్యంగా కాల్చేయండి: సీఎం సంచ‌ల‌న ఆదేశాలు!

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. 'వాళ్ల‌ను నిర్దాక్ష్యిణ్యంగా కాల్చేయండి' అంటూ ఎవ‌రికో ఆదేశాలిస్తూ సీఎం ఫోన్ మాట్లాడ‌టం అందులో క‌నిపిస్తోంది. ఇదేమీ మార్ఫింగ్ చేసిన వీడియో కాదు. కుమార‌స్వామి కూడా తాను అలా మాట్లాడిన విష‌యాన్ని అంగీక‌రించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో క‌ర్ణాట‌క‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది.

అస‌లేం జ‌రిగిందంటే.. క‌ర్ణాట‌క‌లోని మాండ్య ప్రాంతానికి చెందిన జేడీఎస్‌ నేత హెచ్‌.ప్రకాశ్‌ను సోమవారం కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ప్రకాశ్‌ కారును అడ్డగించి కత్తులతో నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కుమారస్వామి ఆగ్ర‌హంతో ఊగిపోతూ తీవ్రంగా స్పందించారు. ‘ప్ర‌కాశ్‌ చాలా మంచి వ్యక్తి. అత‌ణ్ని ఎందుకు చంపారో తెలియట్లేదు. హంతకులను కనికరం లేకుండా కాల్చిపారేయండి. ఎలాంటి సమస్యా ఉండదు’ అని సీఎం ఫోన్లో అవతలివ్యక్తికి ఆదేశాలిచ్చారు. అక్కడే ఉన్న జర్నలిస్టులు కొందరు కుమారస్వామి మాటలను వీడియోలో రికార్డు చేశారు.

ఆ వీడియో మీడియాలో వ‌చ్చేసింది. సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ గా మారింది. దీంతో కుమార‌స్వామి వ్య‌వ‌హారం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి హింసను ప్రేరేపిస్తున్నారంటూ ప్ర‌తిప‌క్షాలతోపాటు సాధార‌ణ ప్ర‌జ‌లు ఆయ‌న‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్య‌మంత్రే ఇలా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అంటూ నిల‌దీస్తున్నారు.

తాజా వ్య‌వ‌హారంపై కుమార‌స్వామి స్పందించారు. హత్య చేయమని తాను ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడానంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌కాశ్ ను హ‌త్య చేసిన‌వారు ఇప్ప‌టికే రెండు హత్యలు చేసి జైలుకెళ్లార‌ని సీఎం తెలిపారు. రెండు రోజుల క్రితమే బెయిలు వారు విడుద‌ల‌య్యార‌నిచెప్పారు. అంత‌లోనే మ‌రో హ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో ఆవేశంలో కాల్చేయాలంటూ మాట్లాడాన‌ని చెప్పుకొచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English