మోదీ-షా ద్వ‌యాన్ని సైడ్ చేస్తున్న ఆరెస్సెస్‌!

మోదీ-షా ద్వ‌యాన్ని సైడ్ చేస్తున్న ఆరెస్సెస్‌!

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఘోర ప‌రాజ‌యంతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - పార్టీ జాతీయ‌ అధ్య‌క్షుడు అమిత్ షాల‌ మైలేజీ బాగా ప‌డిపోయింది. సొంత పార్టీ నేత‌లే వారిని పెద్ద‌గా లెక్క చేయ‌డం లేదు. గెల్చిన‌ప్పుడు కాల‌ర్ ఎగ‌రేసే నేత‌లు ప‌రాజ‌యానికీ బాధ్య‌త తీసుకోవాల్సిందేనంటూ నితిన్ గ‌డ్క‌రీ వంటి కొంద‌రు సీనియ‌ర్ నేత‌లు చేసిన నేత‌లు మోదీ-షా ద్వ‌యానికి చుర‌క‌లు వేసేవే. ఇలాంటి వ్యాఖ్య‌ల వెనుక అస‌లు పాత్ర ఆరెస్సెస్ దేన‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి.

బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌. ఏళ్లుగా రాజ‌కీయాల్లో క‌మ‌ల‌నాథుల‌కు మార్గ‌నిర్దేశ‌నం చేస్తున్న‌దీ ఆరెస్సెస్ పెద్ద‌లే. మోదీ - షాల రాక‌తో ప‌రిస్థితిలో చాలానే మార్పు వ‌చ్చింది. ఈ ఇద్ద‌రూ ఆరెస్సెస్ పెద్ద‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌మివ్వ‌లేదు. త‌మ‌కు తాముగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ఎల్‌.కె.అడ్వాణీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి వంటి పార్టీ ఉద్ధండుల‌నూ ప‌క్క‌న పెట్టేశారు. దీనిపై ఆరెస్సెస్ ఆగ్ర‌హించినా.. మోదీ-షా ద్వ‌యం హ‌వా ఆగ‌లేదు. దేశ‌వ్యాప్తంగా బీజేపీ ఇన్నాళ్లూ మంచి ఊపు మీద ఉండ‌టంతో ఆరెస్సెస్ పెద్ద‌లు ఆ ఇద్ద‌రిపై చ‌ర్య‌ల‌కు వెనుకాడారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి - ముఖ్యంగా రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌ను కోల్పోవ‌డంతో ఆరెస్సెస్ తిరిగి రంగ‌ప్ర‌వేశం చేసింది. బీజేపీ వాగ్దానాల్లో ప్ర‌ధాన‌మైన‌ది అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం. ఆ వాగ్దానాన్ని నిల‌బెట్టుకోవ‌డంలో క‌మ‌ల‌నాథులు విఫ‌ల‌మ‌వుతుండ‌టంపై ఆరెస్సెస్ పెద్ద‌లు ఇప్పుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట త‌ప్ప‌డ‌మేంట‌ని నిల‌దీస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌ధాని పీఠం నుంచి మోదీని త‌ప్పించి గ‌డ్క‌రీకి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని ఆరెస్సెస్ యోచిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సొంత పార్టీ నేత‌లు ఇటీవ‌ల మోదీ - షా ద్వ‌యంపై స్వ‌రం పెంచ‌డానికీ ఆరెస్సెస్ అండ‌దండ‌లే కార‌ణ‌మ‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఆరెస్సెస్ తో స‌యోధ్య కుదుర్చుకునేందుకుగాను రాజ‌స్థాన్‌లో సంఘ్ పెద్ద‌ల‌తో అమిత్ షా తాజాగా స‌మావేశ‌మ‌య్యారు. రామ‌మందిర నిర్మాణం స‌హా పలు అంశాల‌పై చ‌ర్చించారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోపు అంటే 2019 మే లోపు రామ‌మందిర నిర్మాణం ప్రారంభించాల్సిందేన‌ని ఈ స‌మావేశంలో షాకు ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ త‌దిత‌ర సంఘ్ నేత‌లు స్ప‌ష్టం చేశార‌ట‌. అయోధ్య కేసులో జ‌న‌వ‌రిలో సుప్రీంకోర్టు తీర్పు వెలువ‌రిస్తుంద‌ని ఆపై ఆల‌య నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తామ‌ని షా హామీ ఇచ్చార‌ట‌.

ఇక మోదీని త‌ప్పించి గ‌డ్క‌రీని ప్ర‌ధాని పీఠం ఎక్కిస్తారంటూ జ‌రుగుతున్న‌ప్ర‌చారంపై చ‌ర్చించేందుకు షా ప్ర‌య‌త్నించినా సంఘ్ పెద్ద‌లు అందుకు అవ‌కాశ‌మివ్వ‌లేద‌ట‌. వేరే అంశాల‌పైనే చ‌ర్చ‌కు ప‌రిమిత‌మ‌య్యార‌ట‌. ప‌లు అంశాల్లో బీజేపీ వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌ట్టార‌ట‌. వారి వైఖ‌రి చూస్తుంటే మోదీ - షా ద్వ‌యాన్ని త్వ‌ర‌లోనే సైడ్ చేసి త‌మ విశ్వాస‌పాత్రుల‌కు బీజేపీ ప‌గ్గాలు అప్ప‌జెప్ప‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English