కేసీఆర్‌ను కలవనున్న జగన్!?

కేసీఆర్‌ను కలవనున్న జగన్!?

తెలంగాణ ము‌ఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి కలవనున్నారా. వారిద్దరు ఈ వారంలో సమవేశం కానున్నారా.. నిజమనే అంటున్నారు ఇరు పార్టీల నాయకులు. తెలంగాణలో అధ్బుత విజయం సాధించి అధికారాన్ని తిరిగి కైవసం చేసుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మద్దతుగా హైదారబాదులోను తమకు పట్టున్న ఖమ్మం, వరంగల్ జిల్లాలలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ప్రచారం చేసింది. దీనికి అనుగుణంగా తామూ కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించింది.

అయితే ఆ పార్టీ బహిరంగంగా ప్రకటించకపోయినా వారి మద్దతు మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికే ఉంటుందని రాజకీయా వర్గాలలో చర్చ జరుగుతోంది. అలాగే తెలంగాణ ఫలితాలు రాగానే వైఎస్. జగన్మోహన రెడ్డి ముందుగా కేసీఆర్‌ను అభినందించారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు, జగన్‌ కలయికను ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో కటౌట్లు, పోస్టర్లు కూడా వెలిసాయి. ఈ నేపథ్యంలో 2019లో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం చేసే అవకాశం ఉందంటున్నారు.

ఈ పరిణామాలలో వైఎస్. జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును వ్యక్తిగతంగా కలుసుకుంటారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అలాగే తనకు మద్దతు ఇస్తానన్న మజ్టీస్ పార్టీ నాయకుడు తన స్నేహితుడు అసదుద్దిన్ ఓవైసీని కూడా జగన్ కలిసే అవకాశం ఉందని అంటున్నారు. తనపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జగన్‌కు ఫోను చేసి పరామర్శించారు. జగన్ ఈ శుక్రవారం కోర్టులో హాజరయ్యేందుకు హైదారాబాద్ వస్తున్నారు. కోర్టు పని  ముగిసిన తర్వాత ఆయన నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉందంటున్నారు.

అలాగే కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన కె. తారక రామారావును కూడా కలిసే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితో కుమ్మకయ్యారంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారాన్ని ఈ కలియిక ద్వారా ఫుల్‌స్టాప్‌ పెట్టించాలని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని అదే పార్టీతో కలిపి పోటీ చేయించిన చంద్రబాబుకు తాను కెసీఆర్‌ను కలవడం తప్పు ఎలా అవుతుందని జగన్ పార్టీ ముఖ్యులతో అన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు కలవడం కంటే ఇప్పుడే కలిస్తే ప్రజలలో సానుకూల పవనాలు వీస్తాయన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English