సొంత నేత‌ల‌కు క్లాస్ పీకిన కేటీఆర్‌

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోవాలంటే వాగ్ధాటి ఉండాలి. ముఖ్యంగా అధికార పార్టీ నాయ‌కుల‌కు అదెంతో అవ‌స‌రం. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఒక్క మాట ఉంటే.. అధికారంలో ఉన్న నేత‌లంతా క‌లిసి మూకుమ్మ‌డి దాడి చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఏడేళ్లులో ఎప్పుడూ లేనంత‌గా అధికార టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌లం పుంజుకున్నాయి. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వ పాల‌న వైఫ‌ల్యాల‌పై ఆ పార్టీ నేత‌ల‌ను తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

టీఆర్ఎస్ నాయ‌కుల‌పై సంజ‌య్, రేవంత్ తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వాళ్ల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసేందుకు టీఆర్ఎస్ నాయ‌కులు కూడా మాట‌ల‌కు ప‌ని చెప్తున్నారు. ఎదురు దాడి చేస్తున్నారు. కానీ కేవ‌లం కొందిమంది మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారు. ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొడుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో సైలెంట్‌గా ఉన్న మిగ‌తా నాయ‌కుల‌కు టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గ‌ట్టిగా క్లాస్ పీకిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఈ ఎన్నిక విష‌యంలో టీఆర్ఎస్ కూడా బీజేపీ కాంగ్రెస్ నేత‌ల‌కు దీటుగానే కౌంట‌ర్ వేస్తోంది.

కానీ టీఆర్ఎస్ ని కొంత‌మంది నాయ‌కుల వ్య‌వ‌హార శైలిపై తాజాగా కేటీఆర్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు పార్టీలోని నాయ‌కులంతా కేటీఆర్ క‌నుసన్న‌ల్లోనే న‌డుస్తున్నార‌నేది తెలిసిన విష‌య‌మే. దీంతో విప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై కొంత‌మంది నేత‌లు మాత్ర‌మే స్పందిస్తున్నార‌ని మిగ‌తా నాయ‌కులు యాక్టివ్‌గా లేర‌ని కేటీఆర్ భావించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఇత‌ర ఇబ్బందుల‌ను కేటీఆర్‌కు చెప్పుకుందామ‌ని వ‌చ్చిన నాయ‌కుల‌పై ఆయ‌న ఫైర్ అయ్యార‌ని స‌మాచారం.

రాష్ట్రంలోని రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని వాళ్ల‌కు క్లాస్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. విప‌క్షాల విమ‌ర్శ‌ల‌పై స్పందించాల్సిన బాధ్య‌త మీకు లేదా? అని ప్ర‌శ్నించిన‌ట్లు తెలిసింది. ఈ సంద‌ర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి గురించి కేటీఆర్ ప్ర‌స్తావించినట్లు స‌మాచారం. పార్టీ నాయ‌క‌త్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకుని వారికి జీవ‌న్‌రెడ్డి కౌంట‌ర్ ఇస్తున్నార‌ని కేటీఆర్ వాళ్ల‌తో అన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అంద‌రూ అలాగే ఉండాల‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి కేటీఆర్ క్లాస్‌తో ఆ నాయ‌కుల్లో మార్పు వ‌స్తుందేమో చూడాలి.