ఓట‌మికి కాంగ్రెస్‌కు సాకు దొరికింది

ఓట‌మికి కాంగ్రెస్‌కు సాకు దొరికింది

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన కాంగ్రెస్‌ పోస్టుమర్టమ్‌ ప్రారంభించింది. ఎక్కడ పొరపాటు జరిగిందనే అంశాలపై నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. తమ తప్పిందాలను కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర నాయకత్వం దారులు వెతుక్కుంటున్నారు. వైఫల్యాలను నిజాయితీగా అంగీకరించి సరిదిద్దుకోకునే ప్రయత్నం చేయకుండా ఈవీఎంలను బూచిగా చూపించి చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ.. ఓటమిపై `లోతుగా` అధ్యయనంచేసి, ఈవీఎంల ట్యాంపరింగ్‌పై హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఓటమిపాలైన నియోజకవర్గాలపై ఒకేసారి హైకోర్టులో దావా వేయడానికి దాసోజు శ్రవణ్‌కుమార్, ప్రేంసాగర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. వారం రోజుల్లో నియోజకవర్గాల్లో అధ్యయనంచేసి నివేదికను తయారుచేయాలని సూచించింది.

శుక్రవారం గాంధీభవనన్‌లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఎన్నికల్లో ఓటమిపై ప్రాథమికంగా చర్చించారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌, ఓటమికి గల కారణాలపై నేతలు విశ్లేషించారు. ఎన్నికల అధికారులు వ్యవహరించిన తీరుపై సమావేశంలో చర్చించారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఈసీ వ్యవహరించిందంటూ ఎక్కువ మంది నాయకులు అభిప్రాయపడ్డారు.

ఓటర్ల తొలగింపు, అవకతవకలపై ఫిర్యాదు చేసినా ఈసీ పట్టించుకోలేదని వాపోయారు. ఎన్నికలనంతరం కూడా ఈవీఎం ట్యాంపరింగ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని కోరినా పట్టించుకోకపోవడాన్ని పలువురు నేతలు తప్పుపట్టారు. దీనిపై హైకోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. అయితే ఈవీఎంల ట్యాంపరింగ్‌పై నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాలపై వేర్వేరుగా కాకుండా ఉమ్మడిగానే న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు.

ఈవీఎంల్లో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో క్రోఢికరించి, సమన్వయపరిచేందుకు టీపీసీసీ ప్రత్యేకంగా దాసోజు శ్రవణ్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. ఈవీఎం ట్యాంపరింగ్‌లపై అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పేపర్‌ బ్యాలెటే శరణ్యమని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. సమావేశానంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పేపర్‌ బ్యాలెట్‌ ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు.

కాగా, ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందని అంటున్నారు. ఓటమిని అంగీకరించకుండా ప్రజాతీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం కలిగించేలా ఉంద‌ని చెప్తున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతో ఈసీని బద్నాం చేయాలనే కాంగ్రెస్ దురాలోచనను బయటపెడుతోంద‌ని, రెట్టించిన ఉత్సాహంతో ఓటర్లు టీఆర్ఎస్‌కు పట్టం కట్టడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని గులాబీ వ‌ర్గాలు అంటున్నాయి.  ఏదో ఒక అంశాన్ని తీసుకుని రచ్చ చేయాలని చూస్తున్నట్టు తాజా పరిణామాలు సూచిస్తున్నాయని మండిప‌డుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English