అక్క‌డ కేసీఆర్ ఉండాలి - ఇక్క‌డ చంద్ర‌బాబు ఉండాలి

అక్క‌డ కేసీఆర్ ఉండాలి - ఇక్క‌డ చంద్ర‌బాబు ఉండాలి

ఒక‌ప్పుడు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలిగిన హీరో సుమ‌న్‌. కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న ఆయ‌న రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఓ ద‌శ‌లో ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తారనే ప్ర‌చార‌మూ జ‌రిగింది. అది జ‌ర‌గ‌లేదు. కానీ - ఆయా పార్టీల‌పై, నేత‌ల‌పై త‌న అభిప్రాయాలు వెల్ల‌డిస్తూ వ‌స్తున్నారు సుమన్‌.
 
తాజాగా గురువారం ఉద‌యం తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న సుమ‌న్ కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రులుగా ఉండాల‌న్న‌దే త‌న ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూశాక త‌న‌కు చాలా సంతోషం క‌లిగింద‌న్నారు. అక్క‌డ కేసీఆర్ మ‌ళ్లీ సీఎం అవుతార‌ని తాను ముందు నుంచీ ప‌లు ఛానెళ్ల‌ ఇంట‌ర్వ్యూల్లో చెప్పిన సంగ‌తిని గుర్తుచేశారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ విజ‌యం కోసం తాను ప్రార్థ‌న‌లు చేశాన‌ని.. అవి ఫ‌లించినందుకు సంతోషంగా ఉంద‌ని అన్నారు.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను అభివృద్ధి బాట‌లో న‌డిపించ‌గ‌ల స‌త్తా కేసీఆర్‌, చంద్ర‌బాబుల‌కే ఉంద‌ని సుమ‌న్ పేర్కొన్నారు. ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి జ్యోతిబ‌సులా వాళ్లు 4-5 ద‌ఫాలు సీఎం ప‌ద‌విని అలంక‌రించాల‌ని అభిల‌షించారు. తెలంగాణ‌లో కేసీఆర్ తాజా విజ‌యానికి ఆయ‌న చేసిన అభివృద్ధి ప‌నులే కార‌ణ‌మ‌న్నారు. ఇచ్చిన హామీల‌ను ఆయ‌న నెర‌వేర్చారంటూ ప్ర‌శంసించారు.

త‌న‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే కేసీఆర్‌ ముంద‌స్తు ఎన్నిక‌లు నిర్వ‌హించి ప్ర‌త్య‌ర్థులంతా ఏక‌మైనా వారిని సింగిల్ గా ఓడించ‌గ‌లిగార‌ని కితాబిచ్చారు. ఏపీలో చంద్ర‌బాబు చేయాల్సిన ప‌నులు ఇంకా ఉన్నాయ‌న్నారు. వాటిని పూర్తిచేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను సంతృప్తి ప‌ర్చి మ‌ళ్లీ చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి కావాల‌ని సుమ‌న్ అభిల‌షించారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఐక‌మ‌త్యంతో, సంతోషంగా ఉండాల‌ని కోరారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య అభివృద్ధి ప‌థంలో పోటీ ఉండాలే త‌ప్ప విద్వేషాలు ఉండ‌కూడ‌ద‌ని ఆకాంక్షించారు. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English