కమలం ఓటమి "పరిపూర్ణ" మా...!?

కమలం ఓటమి

తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరం ముగిసింది. విజేత ఎవరో... పరాజిత ఎవరో.. తేలిపోయింది. ఇంకా తేలాల్సింది ప్రతిపక్షాల బలబలాలే. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ భవితవ్యం తేలాల్సి ఉంది. తెలంగాణ ఎన్నికలకు ముందు శ్రీ పీఠానికి చెందిన పరిపూర్ణానంద స్వామి అధ్యాత్మికం వదిలి వేసి, రాజకీయ బాట పట్టారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీ తీర్దం పుచ్చుకున్నారు.

వందలాది మంది భక్తులకు అధ్యాత్మికతను నేర్పుతూ తీర్దాన్ని పంచాల్సిన పరిపూర్ణానంద తానే రాజకీయ తీర్దం పుచ్చుకోవడం తెలంగాణలో సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 70 స్దానాలు గెలుస్తుందంటూ రాజకీయ ప్రకటనలు చేశారు.

పరిపూర్ణానంద తెలంగాణ వ్యాప్తంగా అనేక సభలలో పాల్గొని బీజేపీదే అధికారం అంటూ ప్రసంగించారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజాకూటమి పక్షాలను తీవ్ర స్దాయిలో విమర్శించారు. తీరా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడే సమయానికి పరిపూర్ణానంద లెక్కకు బొక్క పడింది. 118 స్దానాలలో పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక్క విజయం దక్కింది.

70 స్దానాలతో  అధికారంలోకి వస్తామని ప్రకటించిన పరిపూర్ణానందకు తెలంగాణ ఓటర్లు షాక్ ఇచ్చారు. కేవలం ఒక్క స్దానంలోనే విజయాన్ని అందించారు. ఇంతకు ముందు శాసనసభలో 5 స్థానాలున్న బీజేపీ ఇప్పుడు ఒకే ఒక్క స్థానానికి పడిపోవడం పరిపూర్ణ పరాజయంగా చెబుతున్నారు. ఇంతే కాదు ఈ ఎన్నికలలో ఏకంగా 30కి పైగా స్థానాలలో బీజేపీ డిపాజిట్ కోల్పోయింది. ఇలా డిపాజిట్ కోల్పోయిన వారిలో ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, తాజా మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ కూడా ఉన్నారు. ఎన్నికలంటే ప్రవచనాలు, ప్రబోధాలు కాదని పరిపూర్ణానంద స్వామికి తెలంగాణ ఓటర్లు సుస్పష్టంగా చెప్పారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English