చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్

చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. విజయోత్సాహంతో మీడియాను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో పంచ్‌లు పేల్చారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఆయన సెటైర్లు వేశారు. చంద్రబాబుకు తాను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు కేసీఆర్ పేర్కొనడం విశేషం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకున్న నేపథ్యంలో తాము కూడా ఏపీ ఎన్నికల్లో వేలు పెడతామని అన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. నిజంగానే తాము ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటామని కేసీఆర్ అన్నారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల కోసం చాలా కష్టపడ్డారని.. ఇక్కడంతా తిరిగారని.. ఆయన అంత కష్టపడ్డపుడు తాము బదులు తీర్చుకోకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

తాము ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుంటే తెలంగాణ వారికి సంస్కారం లేదని జనాలంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తమ విజయంపై స్పందిస్తూ లక్షల మంది ఏపీ వాళ్లు ఫోన్లు చేశారని కేసీఆర్ తెలిపారు. ఆ కాల్స్‌తో ఇక్కడ ఫోన్లు పగిలిపోతున్నాయన్నారు. మెసేజ్‌లు, వాట్సాప్‌‌లు నిండిపోతున్నాయని చెప్పారు. ఏపీ రాజకీయాల్లోనూ పాలు పంచుకోవాలని అక్కడి జనాలు అడుగుతున్నారన్నారు. తెలుగువాళ్లందరూ బాగుండాలని తాము కోరుకుంటామని.. అందుకే ఏపీ రాజకీయాల్లో తమ వంతు పాత్ర పోషించి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English