ఊపిరి పీల్చుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

ఊపిరి పీల్చుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీఆర్ఎస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ జనాలు అనుకున్నారు కానీ.. మరీ ఇలా ఏకపక్ష విజయం ఉంటుందని ఊహించలేదు. నాలుగు పార్టీలు ఒక్కటిగా పోటీ చేసిన ప్రజా కూటమి సాధించిందేమీ లేదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. చివరికి బద్ధ శత్రువైన కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు తల బొప్పి కట్టింది. ఆ పార్టీ కేవలం రెండు సీట్లే గెలిచింది.

విజయం ఖాయం అనుకున్న కూకట్ పల్లి.. శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి ఘోర పరాభవాలు తప్పలేదు. ముఖ్యంగా నందమూరి హరికృష్ణ మరణం నేపథ్యంలో ఆయన తనయురాలు సుహాసినిని తెచ్చి నిలబెట్టిన కూకట్ పల్లిలో ఈ స్థాయి పరాభవం ఊహించనిది.

నిజానికి ఇదే నియోజకవర్గంలో హరికృష్ణ కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్‌ను బరిలోకి దించాలని ముందు భావిస్తే అతను నిరాకరించినట్లు ప్రచారం జరిగింది. అదే నిజం అయితే కళ్యాణ్ రామ్ తెలివైన నిర్ణయం తీసుకున్నట్లే. కళ్యాణ్ రామ్ నిలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేదమో కానీ.. అతనైనా గెలిచేవాడన్న గ్యారెంటీ లేదు. టీఆర్ఎస్ వేవ్‌లో అతను కూడా కొట్టుకుపోయేవాడేమో. ఇక పోటీ సంగతలా ఉంచితే తన సోదరి కోసం ప్రచారం చేయకుండా మిన్నకుండిపోవడం ద్వారా కూడా కళ్యాణ్ రామ్ తెలివిగానే వ్యవహరించాడని చెప్పాలి. అతడితో పాటు ఎన్టీఆర్ సైతం ఒత్తిడికి తలొగ్గకుండా ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. ఈ అన్నదమ్ములిద్దరూ ప్రచారం చేసి ఉన్నా పెద్దగా ఫలితం ఉండేది కాదు.

2009 ఎన్నికల్లో పరాజయాల్ని ఎన్టీఆర్ కు కట్టబెట్టి అతడి మీద నెగెటివ్ ముద్ర వేసిన వాళ్లు.. మరోసారి రెచ్చిపోయేవాళ్లు. తారక్‌పై ఐరెన్ లెగ్ ముద్ర వేసేసేవాళ్లు. సుహాసిని స్వల్ప తేడాతో ఓడితే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నిందను మోయాల్సి వచ్చేది. వాళ్లు వస్తే ఆమె గెలిచేదన్న అభిప్రాయం ఉండేది. ఒకవేళ సుహాసిని గెలిస్తే.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ల సాయం లేకున్నా గెలిచాం అంటూ వాళ్లను తీసి పడేసేవాళ్లు. కాబట్టి అంతిమ ఫలితం అన్ని రకాలుగా తారక్, కళ్యాణ్ రామ్‌లకు ఊరటనిచ్చేదే. ఇప్పుడు వాళ్లకు ఏ రకమైన ఇబ్బందీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English