తెలంగాణ కారుదే.. మిగిలిన రాష్ట్రాల్లో ఎవ‌రంటే?

తెలంగాణ కారుదే.. మిగిలిన రాష్ట్రాల్లో ఎవ‌రంటే?

తేలిపోయింది. తెలంగాణ‌లో కింగ్ ఎవ‌ర‌న్న‌ది స్ప‌ష్ట‌మైన‌ట్లే.  కారు జోరుకు తిరుగులేద‌న్న విష‌యం క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. కూట‌మికే తెలంగాణ ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెడ‌తారంటూసాగిన ప్ర‌చారం నిజం కాద‌ని తేలిపోవ‌ట‌మే కాదు.. టైట్ ఫైట్ జ‌రిగిన నేప‌థ్యంలో హంగుకు ఛాన్స్ ఉంద‌న్న మాట బ‌లంగా వినిపించింది. అయితే.. ఇదేమీ నిజం కాద‌న్న విష‌యాన్ని తెలంగాణ ఓట‌ర్లు పోస్ట‌ల్ బ్యాలెట్ నుంచే స్ప‌ష్టం చేస్తున్న ప‌రిస్థితి.

ఉద‌యం 9.30 గంట‌ల ప్రాంతంలో తెలంగాణ‌లో ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన ఫ‌లితాల్ని చూస్తే.. మొత్తం 119 స్థానాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ 75 స్థానాల‌కు సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు రాగా.. అందులో టీఆర్ఎస్ 61 స్థానాల్లో.. కాంగ్రెస్ 8.. టీడీపీ ఒక్క స్థానంలో.. బీజేపీ మూడు స్థానాల్లో మ‌జ్లిస్ ఒక్క చోట‌.. ఇత‌రులు ఒక‌చోట అధిక్యంలో ఉన్న‌ట్లుగా తేలింది.

తెలంగాణ‌ను విడిచి పెట్టి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన మిగిలిన నాలుగు రాష్ట్రాల సీన్ చూస్తే..
రాజ‌స్థాన్‌
మొద‌ట్నించి అనుకుంటున్న‌ట్లే బీజేపీపై వ్య‌తిరేక‌త రాజ‌స్థాన్ ప్ర‌జ‌ల్లో భారీగా ఉంది. కాంగ్రెస్ స్ప‌ష్ట‌మైన మెజార్టీతో ఆ రాష్ట్రంలో ప‌గ్గాలు చేజిక్కించుకునే దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. మొత్తం 199 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన ఫ‌లితాల్ని చూస్తే.. కాంగ్రెస్ కూట‌మి 74 స్థానాల్లో.. బీజేపీ 56 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇత‌రులు 13 చోట్ల అధిక్య‌త‌లో ఉన్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌
మొత్తం 230 స్థానాలున్న ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌.. బీజేపీ మ‌ధ్య పోరు పోటాపోటీగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన ఫ‌లితాల్ని చూస్తే.. 28 స్థానాల్లో బీజేపీ అధిక్య‌త‌లో ఉంటే.. కాంగ్రెస్ కూట‌మి 17 స్థానాల్లో అధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది.

ఛ‌త్తీస్ గ‌ఢ్‌
గ‌డిచిన రెండుసార్లుగా వ‌రుస‌గా అధికారాన్ని చేజిక్కించుకుంటున్న బీజేపీకి ఈసారి రాష్ట్ర ప్ర‌జ‌లు షాకిచ్చారు. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా.. ఛ‌త్తీస్ గ‌ఢ్ ప్ర‌జ‌లు బీజేపీపై త‌మ‌కున్న ఆగ్ర‌హాన్ని ఓట్ల రూపంలో తెలియ‌జేశారు. 90 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన ఫ‌లితాల్ని చూస్తే.. అధికార బీజేపీ 19 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంటే.. కాంగ్రెస్ 45 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంది. జేసీసీ(జే) కూట‌మి ఆరు స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంది.

మిజోరం
ఈశాన్య రాష్ట్రమైన ఈ బుల్లి రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలు ఉండ‌గా.. ఎంఎన్ఎఫ్ 11 స్థానాల్లో కాంగ్రెస్ 4 స్థానాల్లో బీజేపీ రెండు స్థానాల్లో అధిక్య‌త‌లో ఉంది. చూస్తుంటే.. కాంగ్రెస్ కు మిశ్ర‌మ ఫ‌లితం వ‌స్తుండ‌గా.. బీజేపీకి భారీ షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English