కూటమి వస్తే ? : అధికారుల గుండెల్లో రైలు

కూటమి వస్తే ? : అధికారుల గుండెల్లో రైలు

తెలంగాణలో ముందస్తు సమరం ముగింపు దశకు వచ్చింది. శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 11 తేదిన ఉదయం 11 గంటలకల్లా తేటతెల్లమవుతాయి. ఈ ఫలితాల వెల్లడితో తెలంగాణలో ఎవరు అధికారంలోకి వస్తారో తేలిపోతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటే అధికార గణంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

 పైగా ఈ ఎన్నికలలో తమకు సహకరించిన ఉన్నతాధికారులకు తాయిలాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అలా కాకుండా మహాకూటమి పైచేయి సాధించి అధికారంలోకి వస్తే మాత్రం అధికారులకు తిప్పలు తప్పేలాలేవు. ఇదే గుబులు తెలంగాణలో ఉన్నతాధికారులను దడ పుట్టిస్తోంది. ముఖ్యంగా ఇతర శాఖల అధికారుల మాట ఎలా ఉన్న పోలీస్ అధికారులలో మాత్రం ఈ భయం తీవ్రంగా ఉంది.

 తెలంగాణ రాష్ట్ర సమితి అద్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందస్తు ఎన్నికలు ప్రకటించిన సమయంలో ఆ పార్టీదే విజయమని పోలిసాధికారులు బలంగా నమ్మారు. దీంతో అధికారులు కాస్త దూకూడుగానే ప్రవర్తించారు. డీజీపీతో సహా పలు జిల్లాలకు చెందిన పోలిస్ అధికారులు మరింత రెచ్చిపోయారని మహాకూటమి నాయకులు చెబుతున్నారు.

తాము అధికారంలోకి వస్తే మిమ్మల్ని వదలి పెట్టమంటూ ఒకరిద్దరు నాయకులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రెండు రోజుల క్రితం వరకూ అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న అధికారులు లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఆందోళనలో పడ్డట్టు చెబుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా మహాకూటమికి అనుకూలంగా ఉందని లగడపాటి రాజగోపాల్ సర్వేలో తేలింది. దీంతో మహాకూటమి అధికారంలోకి వస్తే తమకు పాట్లు తప్పవని పోలీస్ అధికారులు ఆందోళనగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్టు విషయంలో దుందుడుకుగా వ్యవహరించిన వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది.

ఆమెను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అన్నపూర్ణ స్ధానంలో అవినాష్ మహంతిని నియమించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ డీజీపీ మహేంద్ర రెడ్డితో పాటు పలువురి ఐపీఎస్ అధికారులకు స్దాన చలనం తప్పదంటున్నారు. వీరితో  పాటు  తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా వ్యవహరించిన కొందరు ఐపీఎస్ అధికారులపై కూడా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English