కేసీఆర్ తన సంతకాన్ని ఫోర్జ‌రీ చేయమన్నారా?

కేసీఆర్ తన సంతకాన్ని ఫోర్జ‌రీ చేయమన్నారా?

"తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిత్తులమారి. ఆయన్ని నమ్మలేం. రాజ్యాంగాన్నే ఆయన విశ్వసించలేదు" అని తెలంగాణ జన సమితి నాయకుడు, మల్కాజిగిరి అభ్యర్ధి దిలీప్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇందుకు ఆయన ఏకంగా లోక్‌సభనే సాక్ష్యంగా చూపడం విశేషం.

గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు నెలల తరబడి పార్లమెంటుకు రాలేదని, ఆ సమయంలో తన సభ్యత్వాన్ని రద్దు చేస్తారనే భయంతో కేసీఆర్ ఫోర్జరీ సంతకాలు చేశారని తీవ్ర విమర్శలు చేశారు దిలీప్ కుమార్. లోక్‌సభ సభ్యుడెవరైనా సుదీర్ఘకాలం సభకు హాజరు కాకపోతే  లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ లెటర్ పంపించాల్సి ఉంటుందన్నారు. ఈ లేఖను స్పీకర్ లోక్‌సభలో చదువుతారని, దీనిపై సభ్యుల అభిప్రాయాలు తీసుకుంటారని చెప్పారు.

అయితే 2004 నుంచి 2006 సంవత్సరం వరకూ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న కె.చంద్రశేఖర రావు కొన్ని నెలల పాటు సభకు రాలేదని అన్నారు.  పార్లమెంటు సభ్యుడెవరైనా ఆరు నెలల పాటు సభకు రాకపోయినా.... వారు లీవ్ ఆఫ్ ఆబ్సెన్స్ లెటర్ ఇవ్వకపోయినా అలాంటి వారిని సభ సస్పెండ్ చేస్తుందని దిలీప్ కుమార్ తెలిపారు. తాను సభకు రాకపోవడంతో సస్పెండ్ చేస్తారనే భయంతో కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన సంతకాన్ని ఫోర్జరీ చేయమని అదిలాబాద్ ఎంపీగా ఉన్న మధుసూదన్ రెడ్డి, మరో ఎంపీ రవీంద్ర నాయక్‌లకు చెప్పారని దిలీప్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆ సమయంలో వారిద్దరూ అలాగే చేశారని, ఆ తర్వాత తన వద్దకు వచ్చిన వారు తాము తప్పు చేశామంటూ వాపోయారని అన్నారు. ఈ సంగతిని తాను గతంలో ఓ విలేకరికి చెబితే అది ఇప్పుడు పత్రికల్లో వచ్చిందని, దీంతో తనకు చాలా మంది ఫోన్లు చేసి విషయం అడుగుతున్నారని అన్నారు. ఆనాటి పార్లమెంటు రికార్డులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తే అసలు విషయం బయటపడుతుందని దిలీప్ కుమార్ అన్నారు.

ఇది పార్లమెంటుపై కేసీఆర్ కు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందని దిలీప్ కుమార్ ఎద్దేవా చేశారు. భారత రాజ్యంగం పట్ల, లోక్‌సభ నియమాల పట్ల గౌరవం లేని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా తగరని దిలీప్ కుమార్ అన్నారు. సరిగ్గా పోలింగ్ కు 24 గంటల ముందు దిలీప్ కుమార్ చేసిన ప్రకటన తెలంగాణలో సంచలనం రేపుతోంది,.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English