ల‌గ‌డ‌పాటి ఎఫెక్ట్‌- *కార్లు* మాట్లాడుతున్నాయి!

ల‌గ‌డ‌పాటి ఎఫెక్ట్‌-  *కార్లు* మాట్లాడుతున్నాయి!

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆ పార్టీ నాయకులు ముందే చెప్పారంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్దామని కె.చంద్రశేఖర రావు ప్రకటించాలని నిర్ణయించుకున్న సమయంలో పార్టీ సీనియర్లతో మంతనాలు జరిపారట. ఆ సమావేశంలోనే ముందస్తు ఎన్నికలతో పాటు అభ్యర్ధులు ఎవరన్న అంశంపై కూడా చర్చకు వచ్చిందంటున్నారు. ముందస్తుకు వెళ్లడంపై సీనియర్ల నుంచి బేదాభిప్రాయాలు వ్యక్తం కాకపోయినా సిట్టింగులకు సంబంధించి మాత్రం వాదోవాదాలు జరిగాయని అంటున్నారు.

పార్టీ సిట్టింగులతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో చాలా మందిని మార్చాలని, అప్పుడే విజయం సాధ్యమవుతుందని పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు, కడియం శ్రీహరి, హరీష్ రావు, ఎంపీలు వినోద్, జితేందర్ రెడ్డి వంటి వారు ప్రస్తావించారని అంటున్నారు. అయితే దీనిపై పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాత్రం తనకు అన్ని తెలుసునని, అన్ని నియోజకవర్గాలకు చెందిన నివేదికలు తన వద్ద ఉన్నాయని సమావేశంలో అన్నట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక సీనియర్ నాయకులు మిన్నకుండిపోయారంటున్నారు.

సిట్టింగులపై నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నా తనపై ఉన్న నమ్మకంతో ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితికే ఓటు వేస్తారని కె.చంద్రశేఖర రావు సమావేశంలో అన్నట్లు స‌మాచారం. ముందస్తు ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలు వెల్లడించిన తర్వాత ఒక్కరొక్కరే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారట. సిట్టింగులను మార్చకపోవడం వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని చెప్పిన వారికి " నన్ను నమ్ముకోండి" అని కె.చంద్రశేఖర రావు భరోసా ఇచ్చారంటున్నారు. అయితే తెలంగాణలో వాస్తవ పరిస్థితులు మాత్రం తెలంగాణ అధిష్టానానికి విరుద్ధంగా ఉన్నాయంటున్నారు. ఈ విషయం గమనించని కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనకు వచ్చిన నివేదికల ఆధారంగా సిట్టింగులకు టిక్కట్లు కేటాయించారని, దీని వల్ల పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు.

బుధవారం నాడు పలువురు సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు.ఈ సందర్భంగా వారి మధ్య లగడపాటి రాజగోపాల్ సర్వే చర్చకు వచ్చిందంటున్నారు. అయితే దీనికి సమాధానంగా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు " ఎలాంటి భయాలు వద్దు. మనం గెలుస్తాం" అని భరోసా ఇచ్చారంటున్నారు. చివరి వరకూ ఇదే అతి విశ్వాసంతో ఉండడం చివరకు చేటు తీసుకువస్తుందని తెలంగాణ సీనియర్ నాయకులు తమలో తాము చర్చించుకుంటున్నారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English