రేవంత్ కేసు- మీకు బుర్ర ప‌నిచేయ‌డం లేదా? కోర్టు సీరియ‌స్

రేవంత్ కేసు- మీకు బుర్ర ప‌నిచేయ‌డం లేదా?  కోర్టు సీరియ‌స్

గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌న‌ట్టు... ఓ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంటును ఆట‌విక ప‌ద్ధ‌తిలో, అల్ల‌రి మూక‌ను అరెస్టు చేసిన‌ట్టు ఎత్తుకెళ్లిన పోలీసుల‌పై హైకోర్టు తీవ్రంగా మండిప‌డింది. మీరు ఎంత అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రించారో మీకు అర్థమ‌వుతుందా? "ఇది ప్రజాస్వామ్యామా ? బ‌్రిటిష్ రాజ్య‌మా?  అని కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

పోలీసుల తీరును తీవ్రంగా త‌ప్పు పట్టింది. అత‌ను సీఎం సభను అడ్డుకుంటాడనే అనుమానం వ‌స్తే దానిని ఆప‌డానికి అనేక మార్గాలున్నాయి. మీకు బుర్ర ప‌నిచేయ‌లేదా? ఆలోచించ‌లేదా? ఇలా భయభ్రాంతులకు గురిచేసి అర్ధరాత్రి ఆట‌వికంగా అరెస్టు చేస్తారా? అని కోర్టు పోలీసుల‌ను నిల‌దీసింది. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది.

సభకు కొద్ది దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకోవచ్చు. లాఠీఛార్జి చేయొచ్చు. వాటర్‌ క్యానన్‌లను ప్రయోగించవచ్చు. గాలిలోకి కాల్పులు జరపవచ్చు. రబ్బరు బుల్లెట్లు వాడొచ్చు. ఇన్ని మార్గాలుంటే... వంద మంది పోలీసులు  అర్ధరాత్రి గేట్లు, ద్వారాలు బద్దలు కొట్టి ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చింది? అచ్చం బ్రిటిష్ పాల‌నలో ఇండియ‌న్ల ప‌ట్ల వారు ప్ర‌వ‌ర్తించిన‌ట్టే మీరు రేవంత్ రెడ్డి విష‌యంలో ప్ర‌వ‌ర్తించారు.

నిర‌స‌న తెలిపే వారిని అడ్డుకోవ‌డం మొద‌టి నేరం. అరెస్టు చేయ‌డం రెండో నేరం. అర్ధ‌రాత్రి ఆట‌వికంగా అరెస్టు చేయ‌డం మూడో నేరం.. అని కోర్టు ప్ర‌భుత్వానికి పోలీసుల‌కు క్లాసు పీకింది. క‌వ‌ర్ చేసుకోవ‌డానికి రేవంత్‌ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు చూడండంటూ వీడియో క్లిప్‌ చూపించబోగా ధర్మాసనం దానిని చూడ‌టానికి కూడా నిరాకరించింది.

వీటితో పాటు ప్ర‌భుత్వానికి పోలీసుల‌కు కోర్టు వేసిన ప్ర‌శ్న‌లు ప్ర‌జ‌ల్లో వైర‌ల్ అవుతున్నాయి.

1. "టెక్నాలజీ ఇంత అందుబాటులో ఉంది. రెండు గంటల్లో సమాచారం తెప్పించలేకపోతే ఎలా? వెయిట్‌ చేస్తాం. సమాచారం తెప్పించండి"

2. అడ్వకేట్‌ జనరల్‌, రాష్ట్ర డీజీపీ త‌మ ఎదుట‌ హాజరై వివరణ ఇవ్వాలి.

3. తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఏమైనా కుప్పకూలిందా? సభను అడ్డుకునే వారిని నిలువరించలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారా?

4. నాయకుడిని నిర్బంధంలోకి తీసుకోవ‌డం స‌మస్యకు పరిష్కారమా?

5. ఎన్నికలంటే మనుషులు అదృశ్యం అవుతున్నారు. ఇప్పటికి ఇది మూడో కేసు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ వ్యవహారం ఈ రోజే తేలాలి.

6. రేవంత్‌రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవని ఏజీ అమాయకంగా చెబితే సరిపోదు. అన్ని విషయాలు ఏజీకి తెలిసే ఉంటాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English