ఆప్ కి ఇదే గోల్డెన్ ఛాన్సా ?

చూడబోతే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఇంకా మంచి రోజులు వస్తున్నట్లే ఉంది. ఇప్పటికే మూడుసార్లు వరుసగా ఢిల్లీలో అధికారంలోకి వస్తున్న ఆప్ తాజాగా పంజాబ్ మీద కూడా కన్నేసింది. అరవింద్ కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ తో ఢిల్లీ జనంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీలో బాగా పాతుకు పోవటంతో పొరుగు రాష్ట్రాలపై కేజ్రీవాల్ కన్ను పడింది. ఇందులో భాగంగా పంజాబ్ రాష్ట్రానికి తొందరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.

గతంలో పంజాబ్ లో మూడు ఎంపీ సీట్లతో పాటు 16 ఎంఎల్ఏలను కూడా గెలుచుకున్న చరిత్ర ఉంది ఆప్ కు. కాకపోతే అప్పట్లో ఆప్ లో జరిగిన వివాదాల కారణంగా అన్నింటినీ చేజార్చుకుంది. ఆ తర్వాత 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రం వైపు చూడలేదు. పార్టీలోని అసంతృప్తులను బయటకు పంపేసి, తిరుగుబాటుదారులను అణిచేయటంతో ప్రస్తుతం ఆప్ పరిస్థితులు ప్రశాంతంగానే ఉంది.

ఈ కారణంతోనే ప్రస్తుతం ఆప్ కు పంజాబ్ లో మంచి అవకాశాలున్నాయని కేజ్రీవాల్ భావించారు. దాంతో దూకుడు పెంచారు. పంజాబ్ లో ఆప్ కున్న అవకాశాలపై ఒకటికి రెండుసార్లు సర్వేలు చేయించుకున్నారు. ఫలితాలు సానుకూలంగా రావటంతో వెంటనే ప్రత్యేకంగా కమిటిలు నియమించి పంజాబ్ లో పోటీకి రంగాన్ని సిద్ధం చేశారు. దీనికి తోడు కొన్ని సర్వే సంస్ధలు చేసిన సర్వేల్లో కూడా ఆప్ కు మంచి ఫలితాలే వస్తాయని తేలింది. అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

అయితే ఇప్పుడు హఠాత్తుగా కాంగ్రెస్ లో మొదలైన సంక్షోభం, బీజేపీలో గందరగోళం ఆప్ కు బాగా కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలను కాంగ్రెస్ పార్టీ తనంతట తానుగా చెడగొట్టుకుంటోందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇక నూతన వ్యవసాయ చట్టాల కారణంగా అధికారంలోకి వచ్చే అవకాశాలపై బీజేపీ ఆశలు వదిలేసుకున్నది. చివరగా మిగిలింది శిరోమణి అకాలీదళ్ మాత్రమే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చిన అకాలీదళ్ ఇంకా ఎన్డీయేలో కంటిన్యూ అవుతోంది. ఇదే అకాలీదళ్ కు పెద్ద మైనస్ గా మారుతోంది. దీన్నే ఆప్ నేతలు ప్రధానంగా ఎత్తి చూపుతున్నారు.

అంటే పంజాబ్ లోని మూడు పెద్ద పార్టీలకూ గట్టి మైనస్ పాయింట్లున్నాయి. ఇదే ఆప్ విషయానికి వస్తే కేజ్రీవాల్ క్లీన్ ఇమేజీయే అతిపెద్ద ప్లస్ పాయింట్. అలాగే మైనస్ పాయింట్లంటు ఏమీలేదు. బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ అంటే విసుగుపుట్టిన జనాలు కచ్చితంగా ఆప్ కే ఓట్లేస్తారని అంచనా వేస్తున్నారు. కాబట్టి పక్కా ప్లాన్ చేస్తే ఆప్ పంజాబ్ లో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందా లేకపోతే అధికారంలోకి వచ్చేస్తుందా ? అనేది ఇంకా స్పష్టత రాలేదు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.