అనుకూలమైతే శభాష్... ప్రతికూలమైతే ఖుల్లాస్ !

అనుకూలమైతే శభాష్... ప్రతికూలమైతే ఖుల్లాస్ !

తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి రోజురోజుకు విచిత్రంగా మారుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడు కాని, అభ్యర్ధులను ప్రకటించి అందరి కంటే కాసింత భిన్నంగా ప్రవర్తించినప్పుడు కాని ఉన్న స్ధితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో కనిపించడం లేదంటున్నారు.

నిజానికి ఆ పార్టీ అగ్ర నాయకులకు, అభ్యర్ధులకు కూడా రోజురోజుకు వారి గెలుపుపై నమ్మకం సన్నగిల్లుతోందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా లోక్‌సభ మాజీ సభ్యుడు, సర్వేల నిపుణుడు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

అంత వరకూ వివిధ సభల్లో తెలంగాణలో పలు సంస్ధలు జరిపిన సర్వేల్లో తమదే విజయమన్న తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు లగడపాటి రాజగోపాల్ చేసిన సర్వేపై మాత్రం పెదవి విరుస్తున్నారు.  ఈ వైఖరిపై రాజకీయ నాయకుల్లోనే కాక రాజకీయ విశ్లేషకుల్లో కూడా వ్యతిరేకత రావడం గమనార్హం.

ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితికి 65 నుంచి 70 వరకూ సీట్లు వస్తాయని లగడపాటి రాజగోపాల్ తనకు వాట్సప్ మెసేజ్ పంపారంటున్న మంత్రి కె.తారక రామారావు ఆ సర్వేను అంగీకరించి నేటి సర్వేను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని రాజకీయ పండితులు అంటున్నారు.

సర్వేలు ఎప్పుడు ఎలా వచ్చినా వాటికి అనుకూలంగాను, వ్యతిరేకంగాను కూడా ప్రవర్తించరాదని, ప్రచారంలో మన పని మనం చేసుకోవాలని బోధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు ఈ సర్వేలను అబ‌ద్ధ‌మ‌ని, పట్టించుకోవద్దని ఎలా చెబుతారనే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే తమకు అనుకూలంగా సర్వే వస్తే అది చేసిన వారిని శభాష్ అని, వ్యతిరేకంగా వస్తే వారి పని ఖుల్లాస్ అని మాట్లాడడం సీనియర్ నాయకులకు మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఒక విధంగా ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి వరం వంటిదని, ఎక్కడ తాము బలహీనంగా ఉన్నామో సర్వే ద్వారా తెలిసింది కాబట్టి అక్కడ నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి ఇది మంచి అవకాశమని అంటున్నారు. పార్టీ శ్రేణులను ఆ దిశగా పరుగులు పెట్టించి ఉన్న రెండు రోజుల సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English