ల‌గ‌డ‌పాటి స‌ర్వే - హంగ్ లేదా హ‌స్తం !

ల‌గ‌డ‌పాటి స‌ర్వే - హంగ్ లేదా హ‌స్తం !

తెలంగాణ ఎన్నికలు ఆసక్తిగా జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా తెలుగువారందరూ ఆసక్తిగా గమనిస్తున్న త‌రుణంలో స‌ర్వేలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఎన్నికలు వచ్చాయంటే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించే ఫలితాల కోసం అంతా అసక్తిగా ఎదురుచూస్తుంటారు. తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వీరే విజేతలంటూ కొన్ని రోజుల క్రితం ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన ఆయన...మరికొన్ని నియోజకవర్గాల విజేతల పేర్లు ప్రకటిస్తానని ఆ రోజు చెప్పారు. దీనిక కొన‌సాగింపుగా తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వివ‌రాలు వెల్ల‌డించారు.

8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పాన‌ని దానికి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ల‌గ‌డ‌పాటి రాజగోపాల్ చెప్పారు. బోథ్‌, నారాయణ్‌ పేట్‌ లో ఇండిపెండెంట్లు గెలుస్తారని చెప్పానని, మ‌రిన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా ఇండింపెండెట్లు గెలుస్తార‌ని అన్నారు. ఇబ్రహీంపట్నంలో మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌లో జలంధర్ రెడ్డి, బెల్లంపల్లిలో జి.వినోద్ గెలుస్తార‌ని చెప్పారు. బీజేపీకి గతంలో కన్నా అధిక సీట్లు రానున్నాయని ల‌గ‌డ‌పాటి తెలిపారు. త‌న పేరుతో అనేక తప్పుడు సర్వేలు వస్తున్నాయని, అయితే, తాను వ్యక్తిగతంగా చెప్పిన సర్వేలనే లెక్కలోకి తీసుకోవాలన్నారు.

ఈ ఎన్నికలు వన్‌సైడ్‌గా జరగవని.. టఫ్‌ ఫైట్‌ ఉంటుందని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ వివరించారు. పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ రావొచ్చన్న లగడపాటి.. ఒకవేళ పెరిగితే మహాకూటమికి అనుకూలంగా ఉంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రజల నాడి కాంగ్రెస్‌ వైపే ఉందని లగడపాటి రాజ్‌గోపాల్‌ చెప్పారు. 68.3 పోలింగ్ జరిగితే హంగ్ వచ్చే అవకాశం ఉందన్నారు. అంత‌కు పెరిగితే కాంగ్రెస్‌దే సీటు అన్నారు. వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌జిల్లాలో టీఆర్‌ఎస్‌కు.. రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభిస్తుందని చెప్పారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయన్నారు. హైదరాబాద్ పాటు జిల్లాల్లో కూడా బీజేపీకి సీట్లు వస్తాయన్నారు. నగరంలో మజ్లిస్‌కే ఎక్కువ సీట్లు వస్తాయని వివరించారు. కాగా, వివిధ స‌ర్వేలు టీఆర్ఎస్‌కు అనుకూల‌మ‌ని చెప్తుండ‌గా, ల‌గ‌డ‌పాటి కాంగ్రెస్‌కు ఆధిక్యమ‌ని చెప్ప‌డం సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English