రజనీ కోసం ‘మరణ మాస్’

రజనీ కోసం ‘మరణ మాస్’

ఓవైపు ‘2.0’తో థియేటర్లలో సందడి చేస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. తన కొత్త సినిమా ‘పేట్ట’ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశాడు. సంక్రాంతికి షెడ్యూల్ అయిన ఈ చిత్రం నుంచి తొలి పాటను నిన్ననే లాంచ్ చేశారు. ‘మరణ మాస్’ అంటూ రజనీ మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఈ పాటను తీర్చిదిద్దాడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్.

మన దగ్గర ‘ఊర మాస్’ అనే పదం వాడినట్లే అక్కడ ‘మరణ మాస్’ అంటుంటారు. రజనీ అంటేనే మాస్ హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్. ఈ నేపథ్యంలోనే ఆయనలోని మాస్ యాంగిల్‌ను ఎలివేట్ చేసేలా ఈ పాటను ఊర మాస్‌గా మలిచాడు అనిరుధ్. పాట మొదలవడంతోనే డ్రమ్స్‌తో మోతెక్కిపోతుంది. పాట అంతటా ఈ డ్రమ్స్ మోత కొనసాగుతూనే ఉంటుంది.

స్వయంగా అనిరుధే ఈ పాట పాడాడు. ఐతే మధ్యలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతు కూడా వినిపిస్తుంది. పాటకు తగ్గట్లుగా తన గళాన్ని మార్చే ఎస్పీబీ.. పాత స్టయిల్లో ఈ పాట పాడటం విశేషం. ఈ మధ్య బాలు పాట పాడటం అరుదైపోయింది. చాలా కాలం తర్వాత ఆయన గొంతు వినిపించడం అభిమానులకు అమితానందాన్నిస్తోంది.

 ఇటు అనిరుధ్.. అటు బాలు అదరగొట్టేయడం... మ్యూజిక్ కూడా మోతెక్కిపోవడంతో ఈ పాట ఇన్‌స్టంట్‌గా హిట్టయిపోయింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించాడు. ఇందులో రజనీ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్‌తో పాటు త్రిష నటించింది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖి ఇందులో కీలక పాత్రలు పోషించాడు. పరిస్థితులు అనుకూలిస్తే సంక్రాంతికే అటు తమిళంలో, ఇటు తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English