కేసీఆర్‌పై బాబు పంజా- ప్ర‌జా కూటమి వస్తే దళిత సీఎం

కేసీఆర్‌పై బాబు పంజా-  ప్ర‌జా కూటమి వస్తే దళిత సీఎం

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పాచికలను ఒక్కోటి వెలుపలికి తీస్తున్నారు. సీట్ల సర్దుబాటు విషయంలోను, అభ్యర్ధుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మాత్రం తన చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్ర‌జా కూటమి ఏర్పాటు వరకూ చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ శ్రేణులు చూపించిన సంయమనంతో ఫిదా అయిపోయారు కాంగ్రెస్ నాయకులు.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే చంద్రబాబు నాయుడి నెమ్మది, ప్రవర్తన, మిత్రులతో ఆయన వ్యవహరిస్తున్న తీరుతో అప్పటి వరకూ ఉన్న అభిప్రాయాలను సైతం మార్చుకున్నారట. అయితే చంద్రబాబు గురించి పూర్తిగా తెలుసున్న గులాం నబీ అజాద్, అహ్మద్ పటేల్, జైపాల్ రెడ్డి, కె.వి.పి.రామచంద్రరావు, జానారెడ్డి వంటి సీనియర్లు రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు బాబు గురించి చెబుతూనే ఉన్నారని అంటున్నారు. అయినా వాటికి పెద్దగా విలువలివ్వని రాహుల్ గాంధీకి తాజా హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు రాజకీయ చాణక్యం అర్ధం అయ్యింది అంటున్నారు.

ఇంతకీ చంద్రబాబు నాయుడు తెర మీదకు తీసుకువచ్చిన రాజకీయం ఏమిటనుకుంటున్నారా. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే దళిత శాసనసభ్యుడ్ని ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని తన అభిప్రాయం వెల్లడించినట్లు చెబుతున్నారు. అది కూడా మహిళ అయితే తాము విజయం సాధించిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావును నైతికంగా దెబ్బ తీసినట్లు అవుతుందని చెప్పినట్లు సమాచారం.

తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ప్రకటించిన కె.చంద్రశేఖరరావు అలా చేయలేదు. దీంతో ప్ర‌జా ఫ్రంట్ అధికారంలోకి వస్తే దళితులను... అది కూడా మహిళా సభ్యురాలిని ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు నాయుడు మెలిక పెట్టినట్లు చెబుతున్నారు. ఈ ఎత్తుగడతో కాంగ్రెస్ లో సీనియర్ నాయకులను పక్కన పెట్టడంతో పాటు త‌న ఇమేజ్ డ్యామేజ్ చేయాల‌ని చూసిన కేసీఆర్ ఇమేజ్ ఒకే దెబ్బ‌కు డ్యామేజ్ చేయొచ్చ‌న్న‌ది చంద్రబాబు నాయుడి ఆలోచనగా చెబుతున్నారు. కాంగ్రెస్‌, టీడీపీకి ఇద్ద‌రికీ అది లాభమే. దీంతో పాటు రెండు ఉప ముఖ్యమంత్రి పదవుల్లోనూ ఒకటి మైనార్టీకి, మరొకటి బీసీ కులానికి చెందిన వారికి ఇస్తే తెలంగాణ ప్రజలకు మంచి సందేశం పంపినట్లు అవుతుందని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడి ఈ కొత్త వ్యూహానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు షాక్ అవుతున్నారు. అయితే, అత్య‌ధిక మంత్రి ప‌ద‌వులు ఆ వ‌ర్గానికే ద‌క్కే అవ‌కాశం ఉంది. త‌ద్వారా తెలంగాణ లో సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌ను శాటిస్ఫై చేసిన‌ట్లుంటుందని చంద్ర‌బాబు వ్యూహం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English