ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ ప్రచారకర్త అయిపోయాడే..

ప్రకాష్ రాజ్ టీఆర్ఎస్ ప్రచారకర్త అయిపోయాడే..

సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్.. ఈ మధ్య సినిమాలతో కంటే రాజకీయ వ్యాఖ్యలు.. చర్చలతోనే ఎక్కువగా మీడియాలో హైలైట్ అవుతున్నాడు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్.. గత రెండేళ్లుగా మోడీ అండ్ కో మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇక ఆయన పోరు తీవ్ర స్థాయికి చేరింది.

అక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తూ.. బీజేపీ మీద ఆలౌట్ వార్ ప్రకటించాడు ప్రకాష్. ఇప్పుడాయన తెలంగాణ ఎన్నికల మీద దృష్టిసారించడం విశేషం. ఇటీవలే ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీకి తన మద్దతు ప్రకటించాడు. ముందు కేవలం అభిప్రాయం చెప్పినట్లుగానే కనిపించింది కానీ.. ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌కు ప్రచారకర్తలా మారిపోవడం విశేషం.

తాజాగా ప్రకాష్ టీఆర్ఎస్ అధికారిక పత్రిక అనదగ్గ నమస్తే తెలంగాణకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ పత్రిక ఒక ఫుల్ పేజీలో ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ ప్రచురించడం విశేషం. అందులో ఆయన పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ భజన చేశాడు. కేసీఆర్ గొప్ప నాయకుడన్నాడు. ఆయన పాలన భేష్ అన్నాడు. ఆయన విజన్ అద్భుతమన్నాడు. ఇంకా ఓ రేంజిలో కేసీఆర్‌ను పొగిడాడు. కేటీఆర్ మీద కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. కేసీఆర్ పథకాల మీద కూడా ప్రశంసలు కురిపించాడు. మహాకూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని అంటూ ప్రకాష్ రాజ్ రాజకీయ విమర్శలు చేయడం గమనార్హం.

తానొక సాధారణ ఓటరుగా.. సామాన్యుడిగా ఈ అభిప్రాయాలు చెబుతున్నట్లుగా మాట్లాడిన ప్రకాష్ రాజ్.. కేసీఆర్ పాలనలో లోపాలే లేవన్నట్లుగా ఏక పక్షంగా మాట్లాడటం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయం. ఆయన తటస్థుడే అయినట్లయితే లోపాలు కూడా ఎత్తి చూపాలి. ఈ మైనస్‌లు ఉన్నాయి.. అయినప్పటికీ కేసీఆరే బెటర్ అంటే ఓకే కానీ.. ఏకపక్షంగా కేసీఆర్‌ను పొగుడుతూ.. టీఆర్ఎసే అధికారంలోకి రావాలని వ్యాఖ్యానించడం మాత్రం ఆయన స్టాండ్ విషయంలో సందేహాలు రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English