టైం చూసి కేసీఆర్‌పై క‌సి తీర్చుకుంటున్న ఆర్కే!

టైం చూసి కేసీఆర్‌పై క‌సి తీర్చుకుంటున్న ఆర్కే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో 5 రోజులే గ‌డువుంది. ప్ర‌చార ప‌ర్వానికి మూడు రోజుల్లో తెర‌ప‌డ‌నుంది. ఇటు టీఆర్ఎస్‌, అటు ప్ర‌జా కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుపై పూర్తి ధీమాతో ఉన్నాయి. త‌మ‌కు మెజారిటీ స్థానాలు ద‌క్కుతాయంటూ విశ్వాసం వ్య‌క్తం చేస్తున్నాయి. మ‌రోవైపు మీడియాలో వివిధ కోణాల్లో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప్ర‌యోజ‌నం చేకూరేలా కొన్ని వార్తాసంస్థ‌లు క‌థ‌నాల‌ను వండి వారుస్తున్నాయి. మ‌రికొన్ని నిజానిజాలను ప్ర‌జ‌ల ముందుకు తీసుకొస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ ప‌త్రిక ఆంధ్ర‌జ్యోతిలో ఆదివారం ఆర్కే కొత్త ప‌లుకు పేరిట వెలువ‌డిన క‌థ‌నం తాజాగా ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. కారు కింది నేల క‌దులుతోంది అన్న శీర్షిక‌తో ఆర్కే ఈ వ్యాసం రాశారు. ఈ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడిపోబోతోంద‌ని సంకేతాలిచ్చారు. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల సంద‌డి మొద‌ల‌య్యాక టీఆర్ఎస్‌ గెలుపును శంకిస్తూ ఆంధ్ర‌జ్యోతి వెలువ‌రించిన తొలి క‌థ‌నం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

దాదాపు 20 రోజుల క్రితం ఆర్కే ఇదే కొత్త ప‌లుకులో ఓ వ్యాసం రాశారు. తెలంగాణ‌లో మ‌ళ్లీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే ఏర్పాటు కాబోతోందంటూ అందులో కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. అప్ప‌ట్లో ఆ క‌థ‌నం సంచ‌ల‌నం రేకెత్తించింది. క‌నీసం నామినేష‌న్ల ప్ర‌క్రియ అయినా పూర్తి కాకుండానే ఇలా ఓ మీడియా అధినేత ఓ పార్టీకి ఇంత‌గా అనుకూల క‌థ‌నం ఇవ్వ‌డ‌మేంట‌ని చాలామంది విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ త‌ర్వాత ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ - టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుల ప్ర‌చార స‌మ‌యంలో, స్థానిక విప‌క్ష నేత‌ల ప్ర‌చార స‌మ‌యంలో కేసీఆర్‌ను విమ‌ర్శించేలా ఆంధ్ర‌జ్యోతిలో కొన్ని శీర్షిక‌లు క‌నిపించాయి. అయితే - అవ‌న్నీ ఆయా నాయ‌కుల నోటి వెంట వ‌చ్చిన మాట‌లే.

అందుకు భిన్నంగా ఆర్కే త‌న తాజా వ్యాసాన్ని ప్ర‌చురించారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వేను అందులో ప్ర‌స్తావించారు. గులాబీ ద‌ళం తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేయ‌బోద‌నే సంకేతాలిచ్చారు. కేసీఆర్ త్వ‌ర‌గా మేల్కోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఉన్న నాలుగు రోజుల‌ను మెరుగ్గా ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. కేసీఆర్ నేల‌కు దిగితే మంచిద‌ని కూడా కాస్త ఘాటుగా పేర్కొన్నారు. సర్వే ఫ‌లితాలు చెప్తున్న ల‌గ‌డ‌పాటిని విమ‌ర్శించ‌డం మానుకొని త‌న ప‌నిపై తాను కేసీఆర్ దృష్టి పెట్టాల‌ని హిత‌వు ప‌లికారు.

దీంతో తెలంగాణ గ‌డ్డ‌పై గులాబీ ద‌ళ‌ప‌తికి వ్య‌తిరేకంగా ధైర్యంగా ఆర్కే వ్యాసం రాశార‌ని కొంద‌రు ప్ర‌శంసిస్తున్నారు. ఇంత స‌డెన్‌గా ఆర్కే వైఖ‌రిలో మార్పు రావ‌డానికి కార‌ణాలేంట‌ని మ‌రికొంద‌రు ఆలోచిస్తున్నారు. సాధార‌ణంగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఆర్కే ఉంటార‌ని వారు సూచిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ అన్న ప‌రిస్థితి నెల‌కొన‌డంతో చంద్ర‌బాబుకే ఆర్కే అండ‌గా ఉంటున్నార‌ని అంటున్నారు. గ‌తంలో ఆంధ్ర‌జ్యోతిలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు వెలువ‌డేవి. దీంతో ఏబీఎన్‌-ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌పై ప్ర‌భుత్వం తెలంగాణ‌లో ఏడాదికిపైగా నిషేధం విధించింది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ నిషేధం ర‌ద్ద‌యింది. ఆపై కేసీఆర్‌కు అనుకూల క‌థ‌నాలే ఆంధ్ర‌జ్యోతిలో రావ‌డం మొద‌లైంది. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ చంద్ర‌బాబు రాక‌తో ప‌రిస్థితుల్లో మార్పు క‌నిపిస్తోంద‌ని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నాటి నిషేధం తాలూకు క‌సిని కేసీఆర్‌పై ఇక‌ ఆర్కే త‌న మీడియాలో క‌థ‌నాల‌తో తీర్చుకోవ‌డం ఖాయ‌మ‌ని వారు అంచ‌నా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English