గాలి మైండ్ బ్లాంక్ చేసిన వ్య‌క్తితో బాబు రోడ్ షో

గాలి మైండ్ బ్లాంక్ చేసిన వ్య‌క్తితో బాబు రోడ్ షో

క్షణం క్షణం ఉత్కంఠతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేశాయి కర్ణాటకలోని రాజకీయ పరిణామాలు. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్-జేడీఎస్ కూటమి శిబిరాలు, సమావేశాలు, ప్రలోభాలు, ప్యాకేజీలు, ఆఫర్లు, ఆడియో టేప్‌లు లీక్... ఒక్కటేంటి ఇలా ప్రతీ క్షణం ఉత్కంఠే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షా గురిపెట్టారంటే... ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేకపోయినా కన్నడ పీఠం కమల దళానిదే అని అంచనా వేశారంతా... కానీ, ఎక్కడైనా ఒక్కడుంటాడు అన్నట్టుగా వారి వ్యూహాలకు సవాల్ విసిరి... వారి పాచికలు పారకుండా చేశాడు డీకే శివకుమార్‌... కర్ణాటక సీఎంగా జేడీఎస్‌ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారంటే దానికి ముఖ్యకారణం శివకుమారే... ఇదొక్కటే కాదు... ఎప్పుడు కష్టకాలం వచ్చినా కాంగ్రెస్‌ను ఆదుకున్నది శివకుమారే అంటున్నారు అక్కడి నేతలు. అలాంటి నేత‌తో క‌లిసి తాజాగా టీడీపీ ర‌థ‌సార‌థి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం చేయ‌నున్నారు.

ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు తోడుగా... కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్, ఇక కర్ణాటక ఎన్నికల్లో చక్రం తిప్పిన డీకే శివకుమార్‌ కూడా రంగంలోకి దిగితున్నారు. రేపు చంద్రబాబు నాయుడుతో కలిసి మలక్‌పేట్‌ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి తరపున గులాం నబీ ఆజాద్, డీకే శివకుమార్ ప్రచారం నిర్వహించనున్నారు.

ఇదిలాఉండ‌గా, శ‌నివారం కూకట్ పల్లిలో మహా కూటమి బలపరిచిన అభ్యర్థి నందమూరి సుహాసిని తరుపున చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మెట్రో నిర్మాణానికి కేసీఆర్ అడ్డుపడ్డారని అన్నారు. ఈ నాలుగేళ్లలో కేసీఆర్ సాధించిందేమి లేదని తెలిపారు. కేవలం ప్రగతి భవన్, ఫాం హౌస్ తప్ప ఏమీ నిర్మించలేదని విమర్శించారు. నాకు ఇక్కడ ఏం పనని అంటారు.. తానెందుకొచ్చానో ఈ సభలు చూస్తే టీఆర్ఎస్ నేతలకు అర్ధమవుతుందని అన్నారు. కేసీఆర్‌ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించాలని పిలుపు ఇచ్చారు. మీ గుండెల్లో నాకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరన్నారు. ఈ గడ్డపైనే ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని తెలిపారు. కూకట్ పల్లి టీడీపీ కంచుకోట అని స్పష్టం చేశారు.

సైబరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో పెట్టానని గుర్తుచేశారు. సైబరాబాద్‌ నిర్మాణంలో కేసీఆర్‌, కేటీఆర్‌ పాత్ర లేదని చెప్పారు. అలాగే టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పించామని వివరించారు. నేను నిర్మించిన సైబరాబాద్ వల్లే తెలంగాణకు ఆదాయం వస్తుందని తెలిపారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. రాష్ట్రం కోసం ఇక్కడే ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. మా హైదరాబాద్‌కు... మీ అహ్మదాబాద్‌కు పోలికా? అని ప్రశ్నించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English