ఏపీలో రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు: ప‌వ‌న్ ఎఫెక్టేనా?

ఏపీలో హ‌ఠాత్ప‌రిణామం చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోని ర‌హ‌దారుల‌కు ఈ రోజు ఉద‌యం నుంచి మ‌ర‌మ్మ‌తులు ప్రారంభించారు. ఇది ఏ ఒక్క‌చోటో కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా.. దెబ్బ‌తిన్న ప్ర‌ధాన రోడ్ల‌కు.. మ‌ర‌మ్మ‌తులు చేయిస్తున్నారు. హుటాహుటిన తీసుకున్న ఈ నిర్ణ‌యంతో ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుల ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ అధికారులు.. ద‌గ్గ‌రుండి మ‌రీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇక‌, అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఇళ్ల‌కే ప‌రిమిత‌మైనా.. ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇది జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ ఘ‌నతేన‌ని అంటున్నారు ఆ పార్టీ నాయ‌కులు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇటీవ‌ల ఏపీకి సంబంధించిన ప్ర‌ధాన స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టారు. ముఖ్యంగా గ‌త నెల నుంచి కూడా ఆయ‌న రోడ్ల విష‌యంలో ఆయ‌న సీరియ‌స్‌గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చెడిపోయాయ‌ని.. అయినప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని రోడ్ల దుస్తితిపై ప్ర‌తి ఒక్కరూ స్పందించాలంటూ.. ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా కొన్నాళ్ల కింద‌ట పిలుపునిచ్చారు. దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఫొటోలు జ‌న‌సేన ట్విట్ట‌ర్‌ను నింపేశాయి. ఈ క్ర‌మంలో ఆయా ఫొటోల‌ను మీడియాకు కూడా చూపించారు.

ఇక, ఈ క్ర‌మంలోనే మ‌రో రెండు రోజుల్లో శ‌నివారం నుంచి అక్టోబ‌రు 2, గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. ఆయ‌న ఏపీ వ్యాప్తంగా ఉన్న ర‌హ‌దారులను బాగు చేసేందుకు ఉద్య‌మం చేప‌ట్టారు. దీనికి సంబంధించి తాను స్వ‌యంగా రెండు చోట్ల పాల్గొని వాటిని బాగు చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. రాజ‌మండ్రి, అనంత పురంలోని ర‌హ‌దాల‌ను ఎంచుకున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా జ‌నసైనికుల‌కు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే.. ఇది తీవ్ర ఉద్య‌మం రూపం దాలుస్తుండ‌డంతో.. ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే క‌దిలిం ది.

హుటాహుటిన రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు ప్రారంభించింది. ఎక్క‌డిక‌క్క‌డ ర‌హ‌దారుల‌ను బాగు చేస్తోంది. మరీ ముఖ్యంగా ప‌వ‌న్ ప‌ర్య‌టించిన ప్రాంతాల్లో రోడ్ల‌ను వెంట‌నే పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధ‌మయ్యారు. ఉద‌యం నుంచి రంగంలోకి దిగి.. రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేస్తున్నారు. అయితే.. ఇది చూస్తున్న ప్ర‌జ‌లు మాత్రం.. రాజ‌కీయ వివాదం ఎలా ఉన్నా.. ప‌వ‌న్ దెబ్బ‌తో రోడ్లు బాగుప‌డుతున్నాయ‌ని సంబ‌ర ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.