జ‌గ‌న్‌పై ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న కామెంట్‌!

జ‌గ‌న్‌పై ప్ర‌కాశ్ రాజ్ సంచ‌ల‌న కామెంట్‌!

త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ప్ర‌కాశ్ రాజ్‌. కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరం దూరంగా ఉంటున్న ఆయ‌న రాజ‌కీయాల‌పై దృష్టిపెడుతున్నాడు. ప‌లు రాష్ట్రాల్లో గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకొని వాటిని అభివృద్ధి చేసే ప‌నిని భుజాల‌కెత్తుకున్నాడు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌స్తేనే రాష్ట్రం ప్ర‌గ‌తి బాట‌లో ప‌రుగులు పెడుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆ విష‌యం ప‌క్క‌న పెడితే - తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌కాశ్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. జ‌గ‌న్ అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లకు తీవ్రంగా కోపం తెప్పిస్తున్నాయి. ప్ర‌కాశ్ రాజ్ మ‌రీ ఇంత దారుణంగా ఎలా మాట్లాడాడంటూ వారంతా కారాలు, మిరియాలు నూరుతున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే.. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన మీరు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు అనే ప్ర‌శ్న ఇంటర్వ్యూలో ప్ర‌కాశ్ రాజ్‌కు ఎదురైంది. దీంతో ఆయ‌న స్పందిస్తూ ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా ఆర్నెళ్ల స‌మ‌య‌ముంద‌ని, అప్ప‌ట్లోగా ఆలోచించి మ‌ద్ద‌తుపై నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ గురించి స్పందించారు. జ‌గ‌న్ బాగానే పోరాడుతున్నార‌ని చెప్పారు. అయితే - ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి జ‌గ‌న్ బీజేపీకి అమ్ముడుపోతారా? అనే విష‌యాన్ని చూడాల‌ని అన్నారు. త‌మిళ‌నాడులా ఏపీ కాకూడ‌ద‌ని ఆకాంక్షించారు. అన్నా డీఎంకే పార్టీ అమ్ముడుపోవ‌డంతో త‌మిళ‌నాట ప్ర‌స్తుతం తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని సూచించారు.

ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ అభిమానులు, వైసీపీ నేత‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. అస‌లు బీజేపీకి జ‌గ‌న్ అమ్ముడుపోతారేమోన‌నే ఆలోచ‌న ఎలా వ‌చ్చిందంటూ ఆయ‌న్ను ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్ తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడ‌ని.. అందుకే జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపిస్తున్నారు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English