సెక్ర‌టేరియ‌ట్లోనే సీఎంపై కారందాడి..చంపేస్తాన‌ని వార్నింగ్‌

సెక్ర‌టేరియ‌ట్లోనే సీఎంపై కారందాడి..చంపేస్తాన‌ని వార్నింగ్‌

ఆమ్ ఆద్మీ పార్టీ(ఎఎపి) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గ‌త ఏడాది కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా ఆయనపై ఓ వ్యక్తి నల్ల ఇంకు చల్లాడు. కేజ్రీవాల్‌‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ఆయన పక్కనే ఉన్న మనీష్ శిశోడియా, ప్రశాంత్ భూషణ్, సంజయ్ సింగ్‌లపై కూడా ఇంక్ పడిన ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే.  ఆ త‌ర్వాత నాలుగు నెల‌ల‌కు మ‌రో వ్య‌క్తి షూ విసిరాడు. ఈ ప‌రిణామాలే క‌ల‌క‌లం సృష్టించ‌గా...తాజాగా ఓ వ్య‌క్తి ఏకంగా ఆయ‌న‌పై కారంపొడి చ‌ల్లాడు. అదికూడా సాక్షాత్తు స‌చివాల‌యంలోనే కావ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ముఖ్యమంత్రి భోజనం కోసం బయటకు వెళుతుండగా మూడో అంతస్తులోని సీఎం చాంబర్‌కు అత్యంత సమీపంలో ఈ దాడి చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఓ వ్యక్తి సీఎం మొహంపై కారంపొడి చల్లగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి నరైనా ప్రాంతానికి చెందిన అనిల్ శర్మగా గుర్తించారు. ఈ దాడితో సచివాలయంలో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కేజ్రీవాల్ కళ్లద్దాలు కూడా విరిగిపోయాయి. అత్యంత భ‌ద్ర‌త ఉండాల్సిన సెక్ర‌టేరియట్‌లో ఈ దాడి జ‌ర‌గ‌డంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పోలీసుల‌పై మండి ప‌డింది. కేజ్రీవాల్‌పై దాడి చేసిన త‌ర్వాత స‌ద‌రు అనిల్ శ‌ర్మ‌.. నిన్ను కాల్చి చంపుతాను అంటూ హెచ్చ‌రించిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. గ‌తంలో త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లోనూ అత‌డు ఇవే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English