ఎన్టీఆర్ ఏం చేస్తాడిపుడు?

ఎన్టీఆర్ ఏం చేస్తాడిపుడు?

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సంకట స్థితిలో పడ్డాడు. 2009 ఎన్నికల్లో తనను బాగా వాడుకున్న చంద్రబాబు.. ఆ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చాక దాని తాలూకు నెగెటివిటీని తనకు చుట్టేసి పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత ఎప్పుడూ తనను పట్టించుకున్నది లేదు. మరోవైపు బాబాయి బాలకృష్ణ.. ఇతర నందమూరి కుటుంబ సభ్యులు సైతం తనపై ఎలా వివక్ష చూపించింది ఎన్టీఆర్ మరిచిపోలేడు.

తన మానాన తానుంటే.. తన సినిమాలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు.. కార్యకర్తలు దుష్ప్రచారాలు చేయడాన్ని కూడా ఎన్టీఆర్ మరవడం కష్టం. 2014లో విజయం తర్వాత పూర్తిగా తనను.. తన తండ్రి హరికృష్ణను సైతం పక్కన పెట్టేయడం ఎన్టీఆర్ ను ఎంతగా బాధించి ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

అలాంటిది హరికృష్ణ మరణించగానే సానుభూతిని పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు.. బాలయ్య ప్రయత్నిస్తుండటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కు వచ్చి.. అక్కడ బాలయ్య చేసిన ప్రసంగం చూస్తేనే బాబు-బాలయ్య ఉద్దేశాలేంటన్నది స్పష్టం. ఇప్పుడేమో హరికృష్ణ కూతురు సుహాసినికి కూకట్ పల్లి టికెట్ కేటాయించడం ద్వారా ఎన్టీఆర్ ను ఫిక్స్ చేయడానికి ప్రయత్నం జరిగింది.

కూకట్ పల్లిలో సెటిలర్లు.. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ కాబట్టి ఆ సీటూ తమకే ఖాయం అని టీడీపీ భావిస్తోంది. నందమూరి కుటుంబ సభ్యురాలిని దించడం ద్వారా సెంటిమెంటును రగిలించడానికీ వ్యూహ రచన చేసింది. ఆమె అయితే రేప్పొద్దున పార్టీ మారడానికి కూడా అవకాశం ఉండదని.. అలాగే హరికృష్ణ మరణానంతరం ఆయన కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవడానికి కూడా ఉంటుందని.. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి ఆమెకు టికెట్ ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను కూడా ప్రచారానికి రప్పించడానికి ఒత్తిడి చేస్తున్నారు. అతను కాదంటే అక్క కోసం ప్రచారం కూడా చేయడా అన్న వాదన తెచ్చి నింద వేయడానికి ప్రయత్నిస్తారు. ప్రచారానికి వస్తే ఏమో.. ఇన్నాళ్లూ బాబుకు దూరంగా నియంత్రణ పాటించిన తారక్.. ఇప్పుడు ఆయన ఉచ్చులో చిక్కుకున్నాడని.. ఊడిగం చేస్తున్నాడని విమర్శలు వస్తాయి. ఇలా రెండు రకాలుగా ఎన్టీఆర్ సంకట స్థితిని ఎదుర్కొంటున్నాడు తారక్. మధ్యేమార్గంగా సుహాసినికి మద్దతుగా ఒక ప్రకటన ఇచ్చాడు కానీ.. అంతటితో అతడిని వదిలేస్తారా అన్నదే సందేహం. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English