సొంత వారి పైనే పోటీ

సొంత వారి పైనే పోటీ

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వివిధ పార్టీ అభ్యర్ధులు, వారి ప్రత్యర్ధులు చాలా దగ్గరి బంధువులు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారిలో చాలా మంది మరీ దగ్గరి బంధువులు కావడం విశేషం. అంతే కాదు.... రాజకీయాల్లో ఓనమాలు నేర్పిన గురువులపై వారి శిష్యులు కూడా పోటీ చేస్తున్న సందర్భం. వీరంతా తమ బంధువుల ఓట్లు ఎటు వైపు ఉంటాయా అని తర్జనభర్జనలు పడుతున్నారు.

రాజకీయం అంటే అభిమానాలుండవు. ఆప్యాయతలుండవు. అనురాగాలుండవు. ప్రేమలుండవు. కలసి ప్రయాణించిన‌ అడుగులు గుర్తుకు రావు. గెలవాలి. గెలిచి నిలవాలి. అధికార పీఠంపై కూర్చోవాలి. ఇదే నేటి రాజకీయంగా కనపడుతోంది. అత్తా, మేనల్లుడి మధ్య ఓ నియోజకవర్గంలో పోటీ. బావ గారు, ఆయన బావమరిది సతీమణి మధ్య వార్. బాబాయ్.... వారి అబ్బాయ్ మధ్య యుద్ధం. మరో నియోజకవర్గంలో గురుశిష్యుల మధ్య దంగల్.

ఇలా తెలంగాణలో దాదాపు 25 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఈ ఇద్దరు అభ్యర్ధుల మధ్య వారి వారి బంధువులు నలిగిపోతున్నారు. ఎన్నికల సమయంలో అభ్చర్ధులే కాదు వారికి మద్దతిస్తున్న బంధువులు, అతి సమీప స్నేహితులకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అభ్యర్ధుల మాట ఏమో కాని బంధువుల మధ్య మాత్రం ఈ ఎన్నికల పోరు అగాధాలనే కలిగిస్తోందంటున్నారు.

"అభ్యర్ధుల గెలుపు మాట అటుంచితే బంధువుల మధ్య ప్రేమలు, అనురాగాలు మాత్రం ఆవిరవుతున్నాయి" అని మహబూబ్ జిల్లా గద్వాల నుంచి పోటీ చేస్తున్న డి.కె.అరుణ, ఆమెకు ప్రత్యర్ధిగా ఉన్న మేనల్లుడు క్రిష్ణమోహన్ రెడ్డి సమీప బంధువు ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే పరిస్థితి సమీప బంధువులు ప్రత్యర్ధులుగా బరిలో ఉన్న చోట్ల కనిపిస్తోందంటున్నారు. ఎన్నికల్లో ఎవరి వైపు నిలిచినా రెండో వారు తమను శత్రువుగా పరిగణిస్తారనే భయం బంధువులు, దగ్గరి స్నేహితులు వాపోతున్నారు. ఎన్నికలంటే ఏ బంధాలకు ప్రాధన్యం ఇవ్వదని, కేవలం అధికారమే ఇక్కడ ప్రేమాభిమానాలకు  గీటురాయి అని అంటున్నారు. ఇదీ కుర్చికి ఉన్న విలువ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English