కోదండ‌రాం సీట్ల‌లో కాంగ్రెస్ బీఫాంలు

కోదండ‌రాం సీట్ల‌లో కాంగ్రెస్ బీఫాంలు

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ త‌న మార్కు రాజ‌కీయాన్ని ప్ర‌ద‌ర్శించింది. మ‌హా కూట‌మి సీట్ల పంప‌కాల్లో ఇత‌ర పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌లోనూ త‌మ అభ్య‌ర్థులను పోటీకి నిల‌బెట్టింది. భాగ‌స్వామ్య ప‌క్షాల‌కు షాకిచ్చింది. ప్ర‌ధానంగా కోదండ‌రాం నేతృత్వంలోని తెలంగాణ జ‌న స‌మితిని కాంగ్రెస్ ఇరుకున పెట్టింది.

మ‌హా కూట‌మిలో కాంగ్రెస్సే ప్ర‌ధాన ప‌క్ష‌మ‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. కానీ, అందులో భాగ‌స్వామ్య ప‌క్షాలుగా ఉన్న ఇత‌ర పార్టీల‌ను త‌క్కువ‌గా చూడాల్సిన అవ‌స‌రం లేదు. ముఖ్యంగా టీడీపీకి తెలంగాణ‌లో బ‌ల‌మైన కేడ‌ర్ ఉంది. ఆ బ‌లాన్ని చూసే టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సై అంది. సీపీఎం సీట్ల వేట‌లో వెనుక‌బ‌డుతున్నా.. ఆ పార్టీకి కూడా చాలా ప్రాంతాల్లో కేడ‌ర్ ఉంది. ఇక కొత్త‌గా ఆవిర్భ‌వించిన టీజేఎస్ క్షేత్ర స్థాయి బ‌ల‌మెంత అన్న‌ది ప్ర‌స్తుతానికి ప్ర‌శ్నార్థ‌క‌మే అయిన‌ప్ప‌టికీ కోదండ‌రాంకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు.

చాన్నాళ్ల‌పాటు ఎడ‌తెగ‌కుండా సాగిన మ‌హా కూట‌మి సీట్ల పంప‌కం.. నామినేష‌న్ల తుది గ‌డువు ద‌గ్గ‌ర ప‌డ‌టంతో ఎట్ట‌కేల‌కు ఓ కొలిక్కి వ‌చ్చింది. ఆయా పార్టీలు త‌మ‌కు కేటాయించిన సీట్ల‌లో త‌మ త‌మ అభ్య‌ర్థుల‌కు బి ఫారాలు అంద‌జేశాయి. ఇక్క‌డే కాంగ్రెస్ పొత్తు ధ‌ర్మాన్ని విస్మ‌రించింది. త‌మ స్థానాల్లోనే కాకుండా.. కూట‌మిలోని ఇత‌ర పార్టీల‌కు కేటాయించిన సీట్ల‌లోనూ త‌మ అభ్య‌ర్థుల‌కు బి ఫారాలు అంద‌జేసింది. కాంగ్రెస్ తీరు చూసి ఇప్పుడు భాగ‌స్వామ్య‌ప‌క్ష నేత‌లంతా అవాక్క‌వుతున్నారు.

ప్ర‌ధానంగా కోదండ‌రాం నేతృత్వంలోని టీజేఎస్‌ను కాంగ్రెస్ పొత్తు పేరుతో ముంచిన‌ట్లు క‌నిపిస్తోంది. సీట్ల పంప‌కాల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయించిన హుజురాబాద్‌, దుబ్బాక‌, వ‌రంగ‌ల్ ఈస్ట్‌, ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌కు కూడా కాంగ్రెస్ తాజాగా బి ఫారాలు అంద‌జేసింది. బ‌హిరంగంగా ఇబ్బంది పెట్టిన‌ట్టు క‌నిపిస్తున్నా ఇందులో ఆంత‌రంగిక ఒప్పందం ఉందేమోన‌ని విశ్లేష‌కులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English