ఈ అభ్యర్ధులు దగ్గర కిలోల కొద్దీ బంగారం

ఈ అభ్యర్ధులు దగ్గర కిలోల కొద్దీ బంగారం

ఇది అందరిని ఆశ్యర్యానికి గురి చేస్తోంది. అనేక‌మందిని కలవరపెడుతోంది. స‌మాజాన్ని ఆందోళనలో పడేస్తోంది. ఇంతకు ఇది ఏమిటీ అనుకుంటున్నారా.... ఏముందండి..... బంగారం. అవును బంగారమే. అదేమిటి బంగారం కలవరపెట్టడమా అనుకుంటున్నారా. ప్రజల బంగారం గురించి కాదు ఈ ప్రస్తావన. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్ధులు తమ అఫిడవిట్లలో ప్రకటిస్తున్న బంగారం గురించే ఇదంతా.

రాజకీయ నాయకుల ఆస్తులు కూడబెట్టుకుంటారని అందరికి తెలిసిందే. అయితే వివిధ పార్టీలకు చెందిన నాయకుల దగ్గర, వారి సతీమణుల దగ్గర ఉన్న బంగారం నిల్వ‌ గురించి తెలిస్తే మాత్రం వీరు రాజకీయ నాయకులా...లేక బంగారం వ్యాపారులా అని ఆశ్యర్యపోతున్నారు ప్రజలు. నిజానికి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీల నాయకుల దగ్గరే ఎక్కువ ఆస్తులున్నాయనే అపోహ గతంలో ఉండేది. కొన్నాళ్ల వరకూ అది వాస్తవమే కూడా. అయితే గడచిన కొన్ని సంవత్సరాలుగా రాజకీయ పార్టీల నాయకుల ఆస్తులు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అవును ఆందోళ‌నే.  ఆ డ‌బ్బు ఎక్క‌డిది అని ఆలోచిస్తే ఆందోళ‌నే క‌దా!

బంగారు తెలంగాణ సాధిస్తామని రాజకీయ నాయకులు ప్రకటించినా దాని మాట దేవుడెరుగు రాజకీయ నాయకులు మాత్రం బంగారం వెనకేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా బరిలో ఉన్న మాగంటి గోపీనాథ్ తన వద్ద  6.4 కిలోల బంగారం ఉందని అఫిడవిట్‌లో ప్రకటించారు. ఇందులో గోపీనాథ్ వద్ద 1.79 కిలోలు ఉంటే మిగిలిన బంగారం ఆయన భార్య వద్ద ఉంది.

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి డమ్మీ అభ్య‌ర్ధిగా బరిలో నిలిచిన గణేష్ గుప్తా తండ్రి బిగాల క్రిష్ణమూర్తి వద్ద రెండు కిలోల బంగారం ఉందట. మంత్రి హరీష్ రావు వద్ద 1.9 కిలోలు, కాంగ్రెస్ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి వద్ద ఐదు కిలోల బంగారం ఉందని ప్రకటించారు. నాగర్ కర్నూల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మర్రి జనార్ధన రెడ్డి వద్ద 2.1 కిలోల బంగారం ఉంది. ఇది కొందరు నాయకులు ప్రకటించిన అఫిడివిట్ ద్వారా వెల్లడైనదే.

ఇక ప్రకటించిన బంగారం ఎంత ఉందో తెలిస్తే ప్రజల గుండెలాగిపోవడం ఖాయం. ఇది తెలంగాణ రాజకీయ బంగారు నాయకులు సంపాదన. ఆశ్చర్యపోవడం ప్రజల వంతు. ఇంతేనా... ఇంకా కావాలి అనడం నాయకుల బంధువుల వంతు.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English